వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చేసే అభ్యంతరకర వ్యాఖ్యలతో మరో రకంగా ఫేమస్ అయ్యారు. ఆయన చదువుకు.. ఆయన డ్రెస్సింగ్‌కు.. ఆ మాటలకు పొంతన ఉండదు కాబట్టి .. అప్పటి వరకూ లోపలే ఉన్న వ్యక్తిత్వం అలా బయటకు వస్తోందని అందరూ అనుకున్నారు. అలా ఫిక్సయిన తర్వాత ఆయనకూ కౌంటర్లు ఇస్తారుగా.. ఇప్పుడు అలాంటి పరిస్థితే రాజ్యసభలోనూ తెచ్చుకున్నారు. వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చల్లో బీజేపీ నేతల్ని మించి ఆయన కాంగ్రెస్ పై వ్యాఖ్యలు చేశారు. బిల్లును సమర్థించుకుంటే…. పాపం వారి అవసరం అలాంటిది అని కాంగ్రెస్ పార్టీ.. వారి గురించి సైలెంట్‌గా ఉండేదమో… కానీ … బీజేపీని మెప్పించడానికి విజసాయిరెడ్డి … కాంగ్రెస్ పార్టీపై తిట్ల దండకం అందుకున్నారు.
విజయసాయిరెడ్డి మాట తీరు చూసి.. చైర్మన్ స్థానంలో కూర్చున్న వారు వారించిన ఆయన ఆగలేదు. చివరికి కాంగ్రెస్ నేతలు.. తిరిగి అదే స్థాయిలో విజయసాయిరెడ్డిని విమర్శించే వరకూ ఆయన మాటల ప్రవాహం కొనసాగింది. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ ఇద్దరూ విజయసాయిరెడ్డి చరిత్రను రాజ్యసభలో చెప్పారు. బెయిల్‌కు అనర్హులని మండిపడ్డారు. కోట్ల రూపాయలు దోచుకుని నిస్సిగ్గుగా సభలో మాట్లాడుతున్నారని.. మళ్లీ అక్కడికే పంపిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ను విమర్శించడంలో విజయసాయిరెడ్డి అతి చూసి.. బీజేపీ ఎంపీలు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు. ఆ నవ్వులో ఉన్న అర్థమేంటో.. వైసీపీ నేతలకు అర్థయిందో లేదో అంచనా వేయడం కష్టం.
ఇప్పటికే విజయసాయిరెడ్డి రాజ్యసభలో తనకు లభిస్తున్న మాట్లాడే సమయాన్ని వినియోగించుకుంటున్న వైనంపై.. అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. సంబంధం లేకపోయినా… న్యాయవ్యవస్థ టాపిక్‌ను తీసుకొచ్చి విమర్శలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా కాంగ్రెస్ పై మండి పడుతున్నారు. బీజేపీపై పొగడ్తలు కురిపిస్తున్నారు. అయితే సాయిరెడ్డి .. తాను ఎవర్ని ఎంత మాటలన్నా.. వారందరూ తిరిగి తనను అదే స్థాయిలో విమర్శించినా.. తాను చేయాలనుకున్నది మాత్రం చేస్తున్నారు. ఎదుటి వార్ని ఎన్ని మాటలనాలో అన్నీ అంటున్నారు. ఎవరి వద్దా తనకు విలువ లేకుండా చేసుకుంటున్నారన్న చర్చ వైసీపీలో నడుస్తోంది.