హైదరాబాద్: ఓటుకు నోటు కేసు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నేతలు లేవనెత్తిన సెక్షన్ 8 అంశం, నిన్న మజ్లిస్ నేతల దౌర్జన్యం నేపథ్యంలో మళ్ళీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అదుపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమయిందని చెప్పటానికి గ్రేటర్ ఎన్నికల సందర్భంగా నిన్న జరిగిన సంఘటనలే నిదర్శనమంటూ అఖిలపక్షనేతలు ఇవాళ సెక్షన్ అమలుకు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్వర్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీ, టీడీపీ, వైసీపీ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, లక్ష్మణ్, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, ఎల్. రమణ, శివకుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ నరసింహన్‌ను కలిసి మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్‌పై, దాడులకు పాల్పడిన ఆయన పార్టీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద కేసులు నమోదు చేయాలని అన్నారు. గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని, సెక్షన్ 8 అమలుకు ఆదేశించాలని కోరారు. గతంలో తాము సెక్షన్ 8 అమలును వ్యతిరేకించినప్పటికీ మజ్లిస పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరమని తాము భావిస్తున్నట్లు చెప్పారు. మూడు డివిజన్లలో రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడి, హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను త్వరలో కలిసిల రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. మరోవైపు నిన్న ఉత్తమ్, షబ్బీర్‌లపై దాడులకు సంబంధించి హబీబ్, కశ్యబ్, ఇస్మాయిల్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.