ఒక నాయకుడు… అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా కనిపించొచ్చు! ప్రతిపక్షంలో ప్రజల తరఫున పోరాడుతున్నప్పుడూ ఘనంగా అనిపించొచ్చు. కానీ, ఆ నాయకుడు మరణించి, దశాబ్దాలు దాటిపోయినా.. అప్పటిగా గొప్పగా కనిపిస్తుంటే, ఇప్పటికీ ఆదర్శప్రాయుడిగా అనిపిస్తుంటే, ఎప్పటికీ ప్రభావంతుడిగా నిలుస్తుంటే… అలాంటి నాయకుడిని ఏమనాలి..? ‘నందమూరి తారక రామారావు’ అని అనాలి. తెలుగు జాతి ఉన్నంతకాలం గుర్తుంచుకోదగ్గ మహా నాయకుడాయన. పార్టీలకు అతీతంగా నేటి తరం రాజకీయ నాయకులు కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారంటే కారణం… ‘ఎన్.టి.ఆర్.’ అనే పేరు ఇప్పటికీ ఒక ఓటు బ్యాంకు కాబట్టి..!
మహానాడు సందర్భంగా తెలుగుదేశం నేతలంతా ప్రతీయేటా ఎన్టీఆర్ ను తలుచుకుంటారు. ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటారు. సరే, సొంత పార్టీ వ్యవస్థాపకుడిగా ఎన్టీఆర్ ను గౌరవించుకోవడం అనేది వారి సొంత కార్యక్రమమే అనుకోవచ్చు. కానీ, వైకాపా, కాంగ్రెస్, తెరాస, జనసేన నేతలు కూడా ఎన్టీఆర్ ను తలుచుకుంటున్న సందర్భాలు ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. తెల్లారితే చాలు తెలుగుదేశంపై నిప్పులు చెరగడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్ష నేత జగన్, ఈ మధ్యనే కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ ను తలుచుకున్నారు. ఆ మహానుభావుడి పేరును జిల్లాకి పెట్టేస్తా అన్నారు. అది వంగవీటి రంగా జన్మస్థలమైనప్పటికీ, వంగవీటి కుటుంబమంతా వైకాపాలో ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ గురించి జగన్ ఇలా మాట్లాడటం విశేషం. ప్రస్తుతం ప్రజా పోరాట యాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ కూడా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మాట్లాడుతూ… ఆ మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ జోహార్లు ఆర్పిస్తున్నా అన్నారు. ఎన్టీఆర్ మహానేత, ఆయన చేపట్టిన అభివృద్ధీ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.
ఇక, తెలంగాణ రాజకీయాలు తీసుకుంటే.. ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ని తీసుకుంటే… ఎన్టీఆర్ మీదున్న ప్రేమాభిమానాలతో కుమారుడికి ఆ పేరే పెట్టుకున్నారు. బాలయ్య వందో చిత్రం ప్రారంభోత్సవానికి వెళ్లి ఎన్టీఆర్ సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఇక, ఈ మధ్యనే మంత్రి కేటీఆర్ కూడా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తనకు ఎన్టీఆర్ పేరు పెట్టారనీ, ఆ పేరు నిలబెట్టే పనులు చేస్తానే తప్ప, చెడగొట్టే విధంగా తాను ఎన్నడూ వ్యవహరించనని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా సమయం వచ్చిన ప్రతీసారీ ఎన్టీఆర్ ను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక, నిన్నమొన్నటి మోత్కుపల్లి నర్సింహులు ఎపిసోడ్ తీసుకుంటే, ఆయన టీడీపీకి దూరమౌతూనే ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గొప్పగా చెప్పుకున్నారు.
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా ఎన్టీఆర్ కు ప్రజల్లో ఉండాల్సి స్థానం అలానే ఉంది. ఆంధ్రప్రదేశ్ పై అంతగా చెరగని ముద్ర వేసేలా నాటి ఎన్టీఆర్ పాలన సాగింది. ఇప్పటికీ ఆ పేరు వింటే ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టే… అన్ని పార్టీలూ ఎన్టీఆర్ ను ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే… తెలంగాణ, ఆంధ్రాల్లో ఇప్పటికీ ఎన్టీఆర్ పేరుతో బలమైన ఓటు బ్యాంకు ఉందనేది నూటికి నూరుశాతం వాస్తవం. అందుకు ప్రబల సాక్ష్యం వైకాపా, తెరాస, కాంగ్రెస్, జనసేన నేతలు ఎన్టీఆర్ ను నేటికీ తల్చుకుంటూ ఉండటమే.