హైదరాబాద్: తెలంగాణలో ప్రవేశపెడుతున్న చీప్ లిక్కర్ కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చే సూచనలు కనబడుతున్నాయి. రోజురోజుకూ ఈ విషయంలో వ్యతిరేకత పెరుగుతోంది. ప్రతిపక్షాలతోబాటు, ప్రజా సంఘాలు, మహిళాసంఘాలు ప్రభుత్వ నూతన మద్యం విధానంపై ముప్పేటదాడి చేస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లో చీప్ లిక్కర్ వ్యతిరేక ఉద్యమం అఖిలపక్ష సమావేశం జరిగింది. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఉత్తమ్ అన్నారు. చీప్ లిక్కర్ పాలసీపై అఖిలపక్షం అభిప్రాయాన్ని తీసుకోవాలని డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్ వ్యతిరేక ఉద్యమ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావును చీప్ లిక్కర్ వ్యతిరేక పోరాట కమిటీ ఛైర్మన్‌గా నియమించుకున్నారు. మరోవైపు చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నాంపల్లి అబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు చీప్ లిక్కర్ ప్రతిపాదనపై రాష్ట్రవ్యాప్తంగా గీత కార్మికులు మండిపడుతున్నారు. కొత్త మద్యం విధానం ప్రకారం మూడు పెగ్గులు రు.30లకే అందిస్తే కల్లును ఎవరూ తాగరని వారు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కల్లుగీత కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
తమ ప్రభుత్వం ప్రకటించిన మద్యం విధానంపై విపక్షాలు, వివిధ సామాజిక వర్గాలనుంచి నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఎర్రవల్లిలో చెప్పారు.