హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న గ్రామజ్యోతి తదితర పథకాలన్నింటిపై అజమాయిషీని పంచాయతీరాజ్, ఐటీ శాఖలమంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్‌కు అప్పజెప్పటంపై టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి రగులుతోంది. దాదాపుగా ప్రతి మంత్రీ, ఎమ్మెల్యే ఈ పథకాలకు నిధులకోసం కేటీఆర్‌ను దేబిరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ నాయకులంటున్నారు.
గ్రామజ్యోతి పథకానికి వచ్చే నాలుగేళ్ళలో ప్రభుత్వం రు.25,000-30,000 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమంకింద రాష్ట్రంలోని ప్రతిగ్రామానికీ రు.2 కోట్లనుంచి రు.6 కోట్లవరకూ ఖర్చుపెట్టనున్నారు. ఈ పథకాన్ని అమలుచేసే బాధ్యతను పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు కట్టబెట్టారు. పేదలకు టూ బెడ్రూమ్ ఫ్లాట్లను పంపిణీచేసే పథకాన్నికూడా గ్రామజ్యోతి పథకంకిందకు తీసుకొచ్చి పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకే అప్పజెప్పారు. పారిశుధ్యానికి సంబంధించిన పనులు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖలకు సంబంధించినవై ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణకుద్దేశించిన 25వేల రిక్షాల కొనుగోలుకూడా పంచాయతీరాజ్ శాఖే చూస్తుండటం విశేషం. మండలస్థాయిలో రిటైల్ మద్యంవ్యాపారం పర్యవేక్షణ అధికారాలను కూడా గ్రామజ్యోతి పథకంకింద చేర్చారు. ఇలా అధికారాలన్నింటినీ కేంద్రీకృతం చేసి పంచాయతీరాజ్ శాఖకు కట్టబెట్టటమేమిటంటూ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారని సమాచారం.