‘అతడు’ తరవాత మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో సెట్టయ్యింది. ఈ వార్త బయటకు వచ్చి చాలాకాలమైనా షూటింగ్ ఇంకా మొదలు కానేలేదు. కథ కుదరిందా, స్క్రీన్ ప్లేలో మార్పులు జరుగుతున్నాయా, నటీనటుల ఎంపిక పూర్తవలేదా? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయినా చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ చాలా రకాలైన పేర్లు బయటకు వచ్చాయి. కానీ… ఇప్పటి వరకూ ఏదీ ఖరారు కాలేదు. అసలు చిత్రబృందం నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో ఫ్యాన్స్ ఉస్సూరుమంటున్నారు. ఇప్పుడు వాళ్లందరికీ ఓ తీపి వార్త. మహేష్ – త్రివిక్రమ్ సినిమా మొదలైపోతోంది. ఆగస్టులో.
అవును… ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలెట్టనున్నామని చిత్రబృందం అధికారిక ప్రకటన ఇచ్చేసింది. అంతేకాదు… రిలీజ్ గురించిన కబురు కూడా చెప్పేసింది. 2023 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. మే లేదా జూన్లో ఈ సినిమా బయటకు రావొచ్చు. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత త్రివిక్రమ్ దే. ఎందుకంటే… ఈ సినిమా పూర్తయిన వెంటనే, మహేష్ బాబు రాజమౌళితో జతకట్టాల్సివుంది. ఆయన మహేష్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే త్రివిక్రమ్ కూడా చక చక సినిమా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.