మరో నెల రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని సీఎం రేవంత్ ప్రకటించారు. యాదాద్రి జిల్లాలో మూసి పునరుజ్జీవ పాదయాత్ర తర్వాత ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటికే ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారని అనుకోవచ్చు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అతి పెద్ద గాంధీ విగ్రహం అనే ఆలోచన కూడా ఈ మూసి ప్రక్షాళన నుంచే వచ్చిందని చెబుతున్నారు. మూసి మొదటి దశ ప్రక్షాళన బాపూ ఘాట్ ఎగువ భాగంలో ఉంటుంది.
ఉస్మాన్‌సాగర్ నుంచి 11.5 కి.మీ. దూరం, హిమాయత్‌సాగర్ నుంచి 9.5 కి.మీ. దూరం జలాలు ప్రవహించి బాపూఘాట్ వద్ద కలుస్తాయి. ఈ ప్రాంతంలోనే ఉస్మాన్ సాగర్ నుంచి ఎగువకు బాపూఘాట్ వరకు మొత్తం 21 కి.మీ. మేర మొదటి దశలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి నీటిని మల్లన్నసాగర్ నుంచి హిమాయత్‌సాగర్‌కు, అక్కడి నుంచి ఉస్మాన్‌సాగర్‌కు మళ్లించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు జలాశయాల నుంచి అవసరానికి తగ్గట్లుగా మూసీకి నీటిని విడుదల చేస్తారు.
మూసీ ప్రక్షాళన, సుందరీకరణలో భాగంగా మొత్తం మీద 30 కి.మీ. పరిధిలో రింగ్ అభివృద్ధి చెందుతుంది. ఐటీ కారిడార్ లోని ఉద్యోగులు ఈ ప్రాంతానికి హాయిగా నడుచుకుంటూ వచ్చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మూసీ సమగ్ర సర్వే పూర్తయ్యాక ఎంత స్థలం ఉందో క్లారిటీ వచ్చాక.. ఎక్కడ ఎలాంటి భవనం కట్టాలో, ఎంత విస్తీర్ణంలో కట్టాలో డిజైన్ చేస్తారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఐదు కన్సల్టెన్సీ సంస్థల కన్సార్షియం మూసీ పునరుజ్జీవం డీపీఆర్‌ను రూపొందిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇంకో నగరాన్ని సృష్టించినట్లు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఓ వైపు నగరం మారిపోవడంతో పాటు మూసి కూడా జీవనదిగా మారుతుంది. అందుకే ఎలాంటి కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని రేవంత్ అంటున్నారు.