తెలంగాణాలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లని వాటి సంఖ్య అన్నిటినీ ముఖ్యమంత్రి కెసిఆర్ దాదాపు ఖరారు చేసేశారు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 533మండలాలని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన తుది ముసాయిదా ప్రకారం తెలంగాణాలో ఏర్పడే జిల్లాలు ఇలాగ ఉంటాయి. అవి:
1.ఆదిలాబాద్,
2.కొమురంభీం,
3.నిర్మల్,
4.కరీంనగర్,
5.జగిత్యాల
6.పెద్దపల్లి,
7.వరంగల్,
8.హన్మకొండ,
9.భూపాలపల్లి(జయశంకర్)
10.మహబూబాబాద్,
11.ఖమ్మం,
12.కొత్తగూడెం,
13.నల్లగొండ
14.సూర్యాపేట,
15.యాదాద్రి,
16.మహబూబ్ నగర్,
17.నాగర్ కర్నూల్
18.వనపర్తి,
19.హైదరాబాద్,
20.రంగారెడ్డి (వికారాబాద్)
21.రంగారెడ్డిఅర్బన్(శంషాబాద్),
22.మల్కాజ్ గిరి,
23.సంగారెడ్డి
24.మెదక్,
25.సిద్దిపేట,
26.నిజామాబాద్,
27.కామారెడ్డి జిల్లాలు.
వీటి గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి వైకాపాని తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించడంతో ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు గురించి ప్రభుత్వం ముందే ప్రతిపక్షాలతో సమావేశాలు నిర్వహిస్తూ వాటి అభిప్రాయాలని, సూచనలని, సలహాలని పరిగణనలోకి తీసుకొని ఉంటే అందరూ హర్షించేవారు. ప్రతిపక్షాలు కూడా దీని కోసం ప్రభుత్వానికి సహకరించి ఉండేవి. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నీ ఫైనల్ చేసేసిన తరువాత మొక్కుబడిగా ప్రతిపక్షాలతో సమావేశం అవడం వలన ప్రయోజనం ఏమిటి? ఏమి ఆశిస్తున్నారు?అనే సందేహం కలుగుతుంది.
ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం తీరుని తప్పు పడుతున్నాయి. రేపు సమావేశం అయినప్పుడు ప్రభుత్వాన్ని తప్పకుండా గట్టిగా నిలదీస్తామని హెచ్చరిస్తున్నాయి కూడా. కనుక ప్రభుత్వ ప్రతిపాదనకి వాటి ఆమోదం పొందడం అసంభవం. పైగా వాటి నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్నది ఒకటైతే జరుగబోయేది వేరొకటని ముందే స్పష్టంగా కనబడుతోంది. మరి అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఎందుకు?