కార్తి సినిమా `నా పేరు శివ 2` ఈ సంక్రాంతికి విడుదల అవుతోంది. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. అసలు ఈ సినిమా ఇంత సైలెంట్ గా ఎప్పుడు తీశారబ్బా? అనే డౌటు వేసింది జనాలకు. తీరా చూస్తే.. ఇది ఇప్పటి సినిమా కాదు. 2014లో కార్తి – పా.రంజిత్ కలిసి `మద్రాస్` అనే ఓసినిమా తీశారు. అది తమిళంలో హిట్టయ్యింది. కార్తి నటించిన ప్రతీ తమిళ సినిమాని, తెలుగులో డబ్ చేయడం ఆనవాయితీ. కానీ అప్పట్లో ఎందుకో.. `మద్రాస్` ని డబ్ చేయలేదు. ఇప్పుడు సడన్ గా `నా పేరు శివ 2` పేరుతో డబ్ చేసి, వదిలేస్తున్నారు. అదీ సంక్రాంతికి. ఏడేళ్ల సినిమాని ఇప్పుడు ఫ్రెష్ గా జనాలు చూస్తారా? డౌటే. ఈ సినిమా ఫ్రెష్ గా కనిపించాలని, కొత్తగా పోస్టర్లు డిజైన్ చేసి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు. అప్పట్లో కార్తి నటించిన `నా పేరు శివ` తెలుగులో హిట్టయ్యింది. అందుకే పార్ట్ 2 అంటూ ఊరిస్తున్నారు. అయితే నా పేరు శివకీ, ఇప్పటి ఈ మద్రాస్ కథకీ ఎలాంటి సంబంధమూ లేదు. కేవలం హిట్ సినిమా టైటిల్ ని వాడుకోవాలన్న ఉద్దేశ్యం తప్ప.