తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ప్లీనరీ వేదికగా.. సంచలన ప్రకటన చేశారు. అది తెలంగాణ మొత్తానికి వర్తించకపోయినా.. టీఆర్ఎస్కు మాత్రం … పూర్తి స్థాయిలో వర్తిస్తుంది. అదేమిటంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు… అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా అందరికీ టిక్కెట్లు ఇస్తారట. 30 నుంచి 50 శాతం ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం లేదని.. కొత్త వారికి టిక్కెట్లివ్వబోతున్నారని మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సిట్టింగులందరికీ టిక్కెట్లు ఇవ్వడమే కాదు..తాను గెలిపించుకుటానన్నారు. అంతటితో ఆగలేదు.. ఖర్మ కాలి.. ఎవరైనా ఓడిపోతే.. వారిని ఎమ్మెల్సీని చేసి… చట్ట సభల్లో కూర్చోబెడతానని చెప్పేశారు.
దాంతో.. ప్లీనరీలో ఉన్న గులాబీ ఎమ్మెల్యేల మొహం ఓ వెలుగు వెలిగిపోయింది. కానీ కేసీఆర్ చెప్పినట్లు అది సాధ్యమేనా అంటే… అసాధ్యమనే చెప్పాలి. వలసల పుణ్యమా అని.. టీఆర్ఎస్ కారు ఇప్పుడు ఓవర్ లోడ్ అయిపోయింది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం నలుగుదు ఐదుగురు నేతలు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. వారిలో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారున్నారు. బంగారు తెలంగాణ పేరుతో మధ్యలో వచ్చి బెర్త్ కొట్టేసిన వారున్నారు. వీరందరికీ కేసీఆర్ న్యాయం చేయడం అంత సులువు కాదు. అందరికీ టిక్కెట్లివ్వడం కూడా సాధ్యం కాదు.
మరి కేసీఆర్ ఎందుకు చెప్పారు..? ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. టీఆర్ఎస్లో ఎక్సెస్ లీడర్లతో పాటు.. టిక్కెట్ గ్యారంటీ లేదని.. ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతోంది. వారిలో కొంత మంది కాంగ్రెస్ తో చర్చలు కూడా ప్రారంభించారని… ప్రభుత్వానికి సమాచారం అందిందని..అందుకే.. కేసీఆర్.. టిక్కెట్లపై ప్రకటన చేశారని చెబుతున్నారు. ఒక వేళ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడం కూడా… వారికి తర్వాత కూడా భవిష్యత్ ఉంటుందని చెప్పడమేనంటున్నారు.
టీఆర్ఎస్ మిత్రపక్షం.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అసెంబ్లీలో ఎప్పుడూ ఓ పిట్ట కథ చెబుతూంటారు. మాటలతో సంతృప్తి పరిచే విదూషకుడికి.. రాజు కూడా.. మాటలతోనే సంతోషపరుస్తాడట. ధనధాన్యాలు ఇస్తానన్న రాజు…ఎన్ని రోజులైనా ఇవ్వకపోతే.. నేరుగా వెళ్లి రాజునే అడుగుతాడు విదూషకుడు. నువ్వ నన్ను మాటలతో సంతృప్తి పరిచావు.. నేను కూడా నిన్ను మాటలతో సంతోషపరిచాను..లెక్క సరిపోతుంది అంటాడట రాజు. కేసీఆర్ ప్రస్తుతం టిక్కెట్ల ప్రకటన కూడా అలాగే ఉంది. పక్క చూపులు చూడకుండా ఎమ్మె్ల్యేలను ఆపడానికి మాటలతోనే సంతృప్తి పరుస్తున్నారు. కానీ కేసీఆర్ రాజకీయాల్ని చూసిన వారెవరూ.. నమ్మరు. తెలంగాణ వస్తే దళితుడ్ని సీఎంను చేస్తానన్న హామీని నిలబెట్టుకున్న స్థాయిలోనే టిక్కెట్ల వ్యవహారం కూడా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం ఉండదు.