తెలంగాణ జాతీయ పార్టీ నేతలంతా ఢిల్లీలో మకాం వేశారు. కీలక నేతలంతా హస్తినకు చేరుకుని పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. పార్టీలో చేరుతామని చెప్పేందుకు పొంగులేటి, జూపల్లి ఢిల్లీ వెళ్లారు. వారితో పాటు రాహుల్ తో సమావేశానికి సీనియర్లు అందర్నీ ఆహ్వానించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా నేతలంతా ఏఐసీసీ కార్యాలయంకు వెళ్లారు. వారితో రాహుల్ అరగంట పాటు భేటీ నిర్వహించారు. ఫోటో సెషన్ లో పాల్గొన్నారు.
మరో వైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. శనివారం వారిని బీజేపీ హైకమాండ్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, నడ్డా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ ఢిల్లీలోనే ఉండిపోయారు. వీరి అంశంపై హైకమాండ్ .. బండిసంజయ్తో చర్చించే అవకాశం ఉంది.
ఎన్నికలు జగ్గర పడుతూ ఉండటంతో రెండు జాతీయ పార్టీల తెలంగాణ శాఖల్లో హడావుడి పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి పీఠం దక్కించుకోవాలని పోరాటం చేస్తున్న జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా తమ స్థానిక నేతల్ని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాలు అప్పగిస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకుల్ని ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. తగ్గిపోతున్న ప్రాభవాన్ని నిలబెట్టుకుని చేరికల్ని ఎలా ప్రోత్సహించుకోవాలా అనిబీజేపీ మథన పడుతూండగా.. మరింతగా ఉక్కిరిబిక్కిరి చేసేలా చేరికల్ని ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.