సెకండ్ వేవ్ తరవాత థియేటర్లు తెరచుకున్నా పెద్దగా ఊపు రాలేదు. ఎస్.ఆర్.కల్యాణమండపం లాంటి ఒకట్రెండు చిన్న సినిమాలు వసూళ్లు అందుకున్నాయి. `సిటీమార్`కి తొలి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయినా – ఆ తరవాత ఒక్కసారిగా డల్ అయిపోయాయి. ఈ శుక్రవారం కూడా సినిమాలొచ్చినా – దేనికీ ఓపెనింగ్స్ లేవు. దాంతో టాలీవుడ్ లో కంగారు మొదలైంది. మంచి సినిమాలు రావట్లేదా? జనాలకు సినిమాలు చూడాలన్న ఆసక్తి పూర్తిగా తగ్గిపోయిందా, లేదంటే ఓటీటీలకు అలవాటు పడిపోయారా? అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ల ఆశలన్నీ `లవ్ స్టోరీ`పైనే.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం `లవ్ స్టోరీ`. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. శేఖర్‌కంటూ ఓ ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. యూత్ తన సినిమాలకు శ్రీరామ రక్ష. కుటుంబ ప్రేక్షకులలోనూ ఫాలోయింగ్ ఉంది. వాళ్లంతా ఈ సినిమా కోసమైనా కదిలి వస్తారన్నది అందరి నమ్మకం. పాటలు, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా `సారంగ దరియా` యూ ట్యూబ్ రికార్డుల్ని సృష్టించింది. ఆ పాట కోసమైనా ప్రేక్షకులు థియేటర్లకు కదిలి వస్తారని చిత్రబృందం నమ్ముతోంది. హైదరాబాద్ లో `లవ్ స్టోరీ` అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. వాటి ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఇదే ఊపు కొనసాగితే.. తొలి రెండు రోజులూ.. `లవ్ స్టోరీ` ఆడే థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడతాయి. లవ్ స్టోరీ హిట్అయితే దసరాకు వస్తున్న సినిమాలకు కాస్త ఊపొస్తుంది. `లవ్ స్టోరీ`నీ చిన్నచూపు చూశారంటే – టాలీవుడ్ మరిన్ని కష్టాల్లో పడినట్టే.