బెంగళూరు పోలీసుల డ్రగ్స్ కేసు ఆపరేషన్ టీఆర్ఎస్లో తుపాను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగళూరు పోలీసుల రాడార్‌లో నలుగురు ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్కు చెందిన వారేనని.. ఆపార్టీలో గుప్పు మంటోంది. ఒకరు కాంగ్రెస్ తరపున అనూహ్య విజయం సాధించి.. టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మిగిలినముగ్గురూ ఉమ్మడిగా తెలంగాణ జిల్లాకు చెందినవారిగా టీఆర్ఎస్లోనే ఓ అంచనాకు వచ్చారు. వీరిలో ఒకరిపై గతంలోనూ డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన ఇద్దరూ బెంగళూరు లింక్‌తో హైలెట్ అవుతున్నారు.
ప్రధానంగా కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే చుట్టూ ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన యువకుడు. అంతే కాదు.. ఫేజ్ త్రీ పార్టీల పై ఎక్కువ ఆసక్తిగా ఉంటారు.కొన్నాళ్ల కిందట.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో దాడి జరిగింది. ఆ ఘటనలో ప్రధానంగా ఈ ఎమ్మెల్యే పేరు కూడా వినిపించింది. పార్టీలంటే పడి చచ్చే ఎమ్మెల్యే బెంగళూరుకూ తరచూ వెళ్తూంటారని.. అక్కడే ఇరుక్కుపోయారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. బెంగళూరు పోలీసులు ప్రధానంగా ఒక ఎమ్మెల్యే గురించి పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి.. విచారణకు పిలుస్తున్నారు. ఆయన వెళ్లడంలేదు.
రేపో మాపో అరెస్ట్ చేసి తరలించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యే ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేను బెంగళూరు పోలీసులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పట్టుకుంటే… తర్వాత పొలిటికల్ సీన్ కూడా మారిపోతుందన్న అభిప్రాయం… వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసులు డ్రగ్స్ కేసును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టినట్లుగా బెంగళూరు పోలీసులు పెట్టకపోతే… ఇక్కడ సంచలనాలు.. నమోదయ్యే అవకాశం ఉంది.