ఏపీలో రాజకీయ పార్టీలన్ని మీడియాను పంచేసుకున్నాయి. ఎవరి గొప్పలు వారి అనుకూల మీడియాలో చెప్పుకుంటారు. అలాగే ప్రత్యర్థి పార్టీపై దుమ్మెత్తి పోస్తారు. అంత వరకే కానీ ఇక ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా అని ముద్ర వేసిన మీడియా గడప కూడా తొక్క కూడదని ఒట్టు పెట్టుకున్నారు. మంత్రి కొడాలి నాని గురువారం ప్రెస్మీట్ పెట్టి.. బూతుల పరంగా తన ప్రసంగానికి న్యాయం చేకూర్చిన తర్వాత కొన్ని మీడియా సంస్థలను బ్యాన్ చేస్తున్నామని ప్రకటించారు. ఆ మీడియా సంస్థలు ఏమిటంటే టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు..వగైరా.
బ్యాన్ చేయడం అంటే ఆ సంస్థల ప్రతినిధులతో వైసీపీ నేతలు మాట్లాడకూడదు. చర్చలకు వెళ్లకూడదు. ఇలాంటి నిబంధనలు అమలు చేస్తారన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సంస్థలు ఉన్నాయని అనుకోరు. అయితే ఇప్పుడు కొత్తగా బ్యాన్ చేయడం ఏమిటి ఎప్పుడో చేశారు కదా అన్న డౌట్ రావొచ్చు. నిజమే కానీ ఇప్పుడు మరోసారి ప్రకటించడానికి కారణం.. టీడీపీ తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియాగా భావిస్తున్న టీవీ9, ఎన్టీవీతో పాటు వైసీపీ అధికార చానల్ సాక్షిని కూడా బాయ్ కాట్ చేసింది. అధికారిక ప్రకటన చేయలేదు కానీ… ఆయా చానళ్ల గడప తొక్కకూడదని నిర్ణయించుకున్నారు. పార్టీ నేతలకూ అదే చెప్పారు.
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం. దురదృష్టవశాత్తూ రాజకీయంకాలుష్యం అయిన ప్రభావం మీడియాపైనా పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే విపక్ష మీడియా అని… విపక్షానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ప్రభుత్వ అనుకూల మీడియా అని ముద్ర అనివార్యంగా పడాల్సి వస్తోంది. దీన్ని మీడియా సంస్థలు భరించాల్సి వస్తోంది. ఈ విభజన మీడియాను ఫాలో అయ్యే వారిలోనూ కనిపిస్తోది. అది అవాంఛనీయమే.