ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారుతున్నారు. ముఖ్యంగా సౌత్ లాబీలో సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో ఒక్క కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు. అంటే.. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా చూపేందుకు ఈ ప్రయత్నం చేశారా లేకపోతే… మొత్తంగా ఆమెకు సంబంధం లేదని.. మొత్తం కేజ్రీవాల్, సిసోడియా చేశారని నిరూపించబోతున్నారా అన్నది సస్పెన్స్ గా మారింది.
అరుణ్ రామచంద్ర పిళ్లై కవిత తరపున బినామీగా వ్యవహరంచారని ఈడీ చెబుతోంది. ఆయన కూడా గతంలో తాను కవిత బినామీనేనని అంగీకరంచారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానన్నారు. మళ్లీ ఇప్పుడు పూర్తిగా మనసు మార్చుకుని అప్రూవర్ గా మారారు. కవిత మద్యం బినామీ వ్యాపారం మొత్తం పిళ్లై పేరు మీదుగా సాగిందని ఈడీ, సీబీఐ చెబుతున్నాయి. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లు అయ్యారు. వారిద్దరూ సౌత్ లాబీ నుంచి కీలకం. ఇక కవిత ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు.
అప్రూవర్లుగా మారడం అంటే.. తాము స్కాం చేశామని అంగీరించి.. నిజాలు చెప్పడమే. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి స్కాంకు పాల్పడ్డారో వారు చెబుతారు. దాని ప్రకారం ఇతర నిందితులు మునిగిపోతారు. ఇక్కడ ఒక్క కల్వకుంట్ల కవిత మాత్రమే అప్రూవర్ కాలేదు. గతంలోనే ఢిల్లీ విచారణ సమయంలోనే ఈడీ కవితను అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ తర్వాత అరెస్టు లాంటివి.. తదుపరి విచారణలు లాంటివి ఏమీ చేయేలదు. మళ్లీ ఇప్పుడే కేసులో కదలిక వస్తోంది. అయితే కవితకూ ఇబ్బందేమీ ఉండదని.. కేవలం ఆప్ నేతల్ని మాత్రమే టార్గెట్ చేశారన్న అనుమానాలు కూడా రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు కీలక పరిణామాలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో జరగనున్నాయి.