వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైసీపీని వీడుతుండగా..తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని గుడ్ బై చెప్పారు. అధికారం కోల్పోయాక వైసీపీ ఊహించని స్థాయిలో బలహీనపడుతోన్న నేపథ్యంలో సీనియర్ నేత ఆళ్ల నాని వైసీపీని వీడటం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే.
ఆళ్ల నానికి ఉభయ గోదావరి జిల్లాలో మంచి పట్టుంది. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన వైసీపీ ఏర్పాటు నుంచి జగన్ తోనే ఉంటున్నారు. ఆ సాన్నిహిత్యంతోనే వైసీపీ హయాంలో జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించారు. కానీ రెండున్నరేళ్ల తర్వాత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో పదవి నుంచి తప్పించారు. అయితే, మంత్రిగా కీలకమైన శాఖల్ని అప్పగించినా ఆయనకు స్వేచ్చగా పని చేసుకునే అవకాశం లభించలేదు.
2024 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి కూటమి ప్రభంజనంలో ఆళ్ల నాని ఓటమి పాలయ్యారు .అప్పటి నుంచి నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ జగన్ కు లేఖ రాశారు. భవిష్యత్ లో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.