ఏలూరుకు చెందిన వైసీపీ నేత , మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్ల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. జనసేనలో చేరుతారని అనుకున్నా ఆయన చివరికి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అనుచరులతో కలిసి మంగళవారం ఆయన టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆళ్ల నాని అసలు పేలు కాళీకృష్ణ శ్రీనివాస్. వైఎస్ కు అత్యంత దగ్గర. ఆయన హయాంలోనే మంచి ప్రోత్సాహం లభించింది. ఈ కారణంగానే ఆయన జగన్ వెంట నడిచారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు కానీ.. పవర్ ఏమీ ఇవ్వలేదు. ఆ పదవి కూడా మూడేళ్ల తర్వాత తీశారు. సాధారణంగా వైసీపీ మార్క్ రాజకీయాలకు ఆయనదూరం. కటువుగా మాట్లాడటం ఉండదు. చాలా పద్దతిగా రాజకీయాలు చేస్తారు. అదే వైసీపీ పెద్దలకు నచ్చలేదేమో కానీ ఆయనను ప్రోత్సహించడం మానేశారు. ఆయన ప్రత్యర్థులకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఈ అంశంపై స్పష్టత రావడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.
కొన్నాళ్లుగా రాజకీయంగా ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయంపై అనుచరులతో చర్చించి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేరికను ఏలూరు టీడీపీ క్యాడర్ వ్యతిరేకించే అవకాశం ఉంది.ల అయితే వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఎవరికీ అన్యాయం జరగదని చంద్రబాబు సర్ది చెప్పి పార్టీలో చేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు టీడీపీ, జనసేనల్లో ఏ పార్టీలో కుదిరితే ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.