గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత అభ్యర్థి కిలారు రోశయ్య చేతులెత్తేశారు. రెండు రోజుల కిందట తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు గెలుపు బాధ్యతలు తీసుకున్న ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డిని రోశయ్య కలిశారు. పార్లమెంట్ సీటులో పోటీ చేయడం తన వల్ల కాదని.. తన పొన్నూరు ఎమ్మెల్యే సీటు తనకు ఇచ్చేయాలని కోరారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా అదే చెప్పారు.
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.. రోశయ్య వద్దనుకుంటున్నారు కాబట్టి.. తన సోదరుడు రామకృష్ణారెడ్డికి సీటిస్తే పోటీ చేస్తామని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. దానికి జగన్ ఆమోదం లభించాల్సి ఉంది.
మొదట గుంటూరు స్థానానికి క్రికెటర్ అంబటి రాయుడు పేరును సీఎం జగన్ దాదాపుగా ఫైనల్ చేసుకున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. అయితే అభ్యర్థిగా అధికారిక ప్రకటన చేయక ముందే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత నర్సరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయులును గుంటూరు నుంచి పోటీ చేాయలని సూచించారు. కానీ ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయి.. నర్సరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు.
తర్వాత సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రకటించారు కూడా. కానీ రెండు వారాల పాటు ఆయన నియోజకవర్గం వైపే రాలేదు. తనకు ఆసక్తి లేదని చెప్పడంతో.. ఉమ్మారెడ్డి అల్లుడు అయిన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఇప్పుడు ఆయన కూడా తప్పుకుంటున్నారు. పోటీ చేయక ముందే ఇలాంటి పరిస్థితి వల్లే ముందే ఓడిపోయినట్లు అయిందని వైసీపీలో అసంతృప్తి కనిపిస్తోంది.