మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను ఎమ్మెల్యేనన్న సంగతి దాదాపుగా మర్చిపోయారు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఆయన మంగళగిరిలో కనిపిస్తున్నారు. మిగిలిన సమయాల్లో ఎక్కడుంటున్నారో కూడా తెలియడం లేదు. పార్టీ కార్యకర్తలకూ పెద్దగా అందుబాటులో ఉండటం లేదు. మరో వైపు నారా లోకేష్ .. తన సొంత డబ్బుతో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వరుసగా ప్రజలతో మమేకం అవుతున్నారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం దూరంగా ఉంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచే పరిస్థితి లేదని ఇప్పటికే వైసీపీకి ఓ క్లారిటీ వచ్చింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. అలాగే రాజధాని సెంటిమెంట్ కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలో ఆళ్లకు టిక్కెట్ ఇవ్వడం అంటే.. పోటీ లేకుండా లోకేష్ ను అసెంబ్లీకి పంపడమేనని వైసీపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. అందుకే ఈ సారి కులంతో కొట్టాలని .. చేనేత వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ నుంచి గంజి చిరంజీవిని చేర్చుకున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తారని చెప్పకపోయినా చివరి క్షణంలో చేనేత వర్గానికి చెందిన ప్రముఖుడు ఎవరినైనా రంగంలోకి దించవచ్చని చెబుతున్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డికి సత్తెనపల్లి ఇస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని వైసీపీ హైకమాండ్‌కు నివేదికలు అందాయి. ఈ కారణంగా ఆయననూ మార్చాలని అనుకుంటున్నారు. ఆయనకు అవనిగడ్డ అని ఓ సారి. .గుంటూరు పశ్చిమ అని మరోసారి లీకులిస్తున్నారు. చివరికి ఎక్కడా ఇవ్వకపోయినా ఆయనకు మాత్రం సత్తెనపల్లిలో ఇవ్వరని అంటున్నారు. మొత్తంగా గుంటూరు జిల్లాలో కీలక నేతల విషయంలో వైసీపీకి టెన్షన్ తప్పడం లేదు.