తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు పిట్ట రాంరెడ్డి అనే నేత హైలెట్ అయ్యారు. అంతా తానే అన్నట్లుగా చెలరేగిపోయేవారు. ఇప్పుడు ఆ స్థానంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు నుంచే… తానే ఆమె తరపున ప్రతినిధి అన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ లోకి రావాలని పలువురు ఇళ్లకు వెళ్లి అడిగి మీడియాకు లీకులు ఇచ్చారు. ఆళ్ల తీరు చూస్తూంటే… షర్మిలకు తానే సజ్జల రామకృష్ణారెడ్డి తరహాలో సలహాదారును అన్నట్లుగా స్వయం పదవి ప్రకటించుకున్నారు.
షర్మిలతో పాటు తాను కూడా ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ముందుగా ప్రకటించుకున్నారు. ఆళ్లకు అంత సీన్ లేదని … షర్మిల పార్టీలో చేరిన తర్వాత విజయవాడలో ఆమె సమక్షంలో పార్టీలో చేరాలని క్లారిటీ ఇవ్వడంతో ఆగిపోయారు. ఇప్పుడు షర్మిల ఆదివారం బాధ్యతలు చేపట్టబోతూండటంతో …. విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర హడావుడి చేస్తున్నారు. తానే మొదట పార్టీలో చేరుతానని చెబుతున్నారు.
ఆళ్ళ రామకృష్ణారెడ్డి.. షర్మలి దగ్గర జగన్ రెడ్డి ఏజెంట్ గా చేరుతున్నారన్నది చాలా మందికి వస్తున్న డౌట్. ఎందుకంటే ఆళ్ల కు జగన్ రెడ్డి సపోర్టు లేకపోతే గడవదు. ఆయన కుటుంబం .. సోదరుడికి చెందిన రాంకీ సంస్థలు ఇలా లింకులు చెప్పుకుంటూ పోతే.. లెక్కలేనంతఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏ ఈగోతో జగన్ రెడ్డిని కాదన్నారో ఎవరికీ తెలియదు. కానీ కోవర్ట్ ఆపరేషన్ కావొచ్చన్న అనుమానం మాత్రం ఎక్కువ మందిలో ఉంది.