అల్లరి నరేష్ ది 60 సినిమాల కెరీర్. ఈ ప్రయాణంలో చెప్పుకోదగిన పాత్రలెన్నో చేశాడు. అందులో ‘గమ్యం’ సినిమాలోని ‘గాలిశీను’ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎన్ని మంచి పాత్రలు చేసినా… ఎన్ని మంచి హిట్లు కొట్టినా ‘గాలిశీను’ పాత్రని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకొంటూనే ఉంటాడు నరేష్. తన అభిమానులు కూడా ‘గాలిశీను’ లాంటి క్యారెక్టర్ ఇంకోటి పడితే బాగుణ్ణు అని కోరుకొంటారు. ఆ లోటుని.. ‘అంజి’గాడు కాస్త వరకూ తీర్చేశాడు.
నాగార్జున ‘నా సామిరంగ’లో నరేష్ అంజిగాడుగా కనిపించాడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే పాత్ర అది. ఆ పాత్ర నరేష్‌కి టేలర్ మేడ్ అన్నట్టు పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది. ఈ సినిమాలో వినోదం పంచే బాధ్యత తనే తీసుకొన్నాడు నరేష్. చివర్లో ఎమోషన్ అందించాడు. ఆ పాత్రని ముగించిన తీరు హృద్యంగా ఉంటుంది. ‘నా సామిరంగ’ క్లైమాక్స్ పండడానికి, ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి అంజి పాత్ర కీలకంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో నరేష్ చేసిన మంచి పాత్రల్లో ‘అంజి’గాడు ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోగా సినిమాలు చేసుకొంటూనే, ఇలాంటి క్యారెక్టర్లు ఎంచుకొంటే.. నరేష్ వంద సినిమాల మైలు రాయిని చాలా త్వరగా చేరుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.