ఒకప్పుడు అల్లరి నరేష్ మినిమం గ్యారెంటీ హీరో. తన సినిమా అంటే నిర్మాత.. పెట్టుబడి ఈజీగా తెచ్చుకునేవాడు. అయితే… ఆ తరవాత ఆ గ్యారెంటీ పోతూ వచ్చింది. ఎనిమిదేళ్లుగా నరేష్‌కి హిట్టే లేదు. నరేష్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో `నాంది` వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచీ.. మంచి స్పందనే వస్తోంది. ముఖ్యంగా నరేష్ నటన గురించి అంతా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. తాను సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టాడని, తన నటనలోని మరో కోణం ఇదే అని కితాబు ఇస్తున్నారు.
ప్రశంసలు ఎవరికైనా బలాన్నిస్తాయి. కానీ ఈ సినిమాకి అదొక్కటే సరిపోదు. ఆర్థికంగానూ నిలబడాలి. `నాంది` ఆ ఫీట్ కూడా సాధించేసింది. ఈ సినిమా పెట్టుబడి తిరిగి సంపాదించేసుకుంది. థియరిటికల్ రిలీజ్ కి ముందే.. ఈ సినిమాకి సంబంధించిన పెట్టుబడి మొత్తం వచ్చేసింది. ఆహా సినిమాకి `నాంది` ఓటీటీ రైట్స్ దక్కాయి. ఓటీటీ రూపంలో.. సగం పెట్టుబడి తిరిగి వచ్చినట్టు టాక్. శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలుపుకుంటే… నిర్మాత సేఫ్ జోన్లో ఉన్నట్టే. థియేటర్ ద్వారా వచ్చేదంతా ఇప్పుడు బోనస్ అనిచెప్పుకోవాలి. నరేష్ తో సినిమా తీసిన నిర్మాత లాభాలు చూడడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. అందుకే నరేష్ కూడా ఖుష్ అవుతున్నాడు. అల్లరోడి సెకండ్ ఇన్నింగ్స్ `నాంది`తో మొదలైంది. మరి ఇక ముందు ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి.