ఎనిమిదేళ్ల పాటు ఒక్క హిట్టు కూడా లేకపోవడం అంటే మాటలు కాదు. మరో హీరో అయితే.. తనని మర్చిపోయేవారు. కానీ అల్లరి నరేష్ వేసుకున్న పునాది గట్టిది. కాబట్టి.. అన్ని ఫ్లాపులొచ్చినా తట్టుకుని నిలబడ్డాడు. తనపై నిర్మాతలు ఇంకా నమ్మకం ఉంచుతున్నారు. కానీ.. తనతో తనకే నమ్మకం సడలిపోయింది. అందుకే `నాంది` హిట్ అవ్వగానే, వేదికపైనే ఏడ్చేశాడు. అంత ఎమోషన్ అయిపోయాడు.
నాందితో.. మరో నరేష్ బయటకు వచ్చాడన్నది వాస్తవం. తనలో ఈసినిమా చాలా నమ్మకాన్ని పెంచింది. అయితే కాస్త గందరగోళమూ తెచ్చింది. `నాంది` తరవాత ఎలాంటి కథలెంచుకోవాలి? అనే విషయంలో నరేష్ కి సందిగ్థం మొదలైంది. `నాంది` సీరియస్ డ్రామా. `నువ్వు ఇలాంటి కథలే చేయాలి` అని నాని లాంటి హీరోలు సైతం.. గట్టిగా సలహాలు ఇచ్చారు. కానీ… నరేష్ బ్రాండ్ వినోదం. దాన్ని మర్చిపోతే ఎలా? అన్నది మరో ప్రశ్న. `నాంది` దర్శకుడే నరేష్ తో మరో సినిమా చేయబోతున్నాడిప్పుడు. అది కూడా సీరియస్ కథనే. వరుసగా అలాంటి కథలు చేయాలా? మధ్యమధ్యలో కామెడీలు చేయాలా? అనే విషయం ఏమాత్రం పాలుపోవడం లేదు అల్లరోడికి. నరేష్ తదుపరి సినిమా `నాంది` తరహాలోనే సీరియస్ గా సాగబోతోందట. కానీ.. నరేష్ చేతిలో ఎప్పటిలానే కామెడీ కథలూ ఉన్నాయి. అదొకటి, ఇదొకటి తరహాలో… బాలెన్స్ చేసుకుంటూ వెళ్తే.. నరేష్ నుంచి మరిన్ని వైవిధ్యభరితమైన చిత్రాలు చూడొచ్చు