రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయి కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్ గత కొంత కాలంగా డిమ్కిలు కొడుతూనే ఉన్నాడు. ప్రేక్షకులను నవ్వించాలన్న తాపత్రయంలో తానే నవ్వులపాలు అవుతున్నాడు. సినిమా సినిమాకు తన స్థాయిని తగ్గించుకుంటూ తిరోగమనంలో శరవేగంగా దూసుకెళ్తున్నాడు. ఈవీవీ సత్యనారాయణగారు ఉన్నంత కాలం మనవాడి వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవాడు. ఆయన చనిపోయిన తర్వాత నుంచి అల్లరి నరేష్‌కి సరైన గైడెన్స్ లేకుండా పోయింది.
ఈవీవీ సత్యనారాయణ దగ్గర దర్శకత్వ విభాగంలో కూడా పనిచేసిన అల్లరి నరేష్… ఆయన దగ్గర నుంచి ఆసక్తికమైన టైటిల్ ఎలా సెలక్ట్ చేసుకోవాలి అన్న ఒక్క విషయమే నేర్చుకున్నట్టున్నాడు. అందుకే ఈ మధ్య వచ్చిన నరేష్ సినిమాల టైటిల్స్ అన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే టైటిల్స్ మాత్రమే ఆసక్తికరంగా ఉంటున్నాయి. సినిమాలు మాత్రం పూర్తిగా నిరాశపరుస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ‘ఇంట్లో దెయ్యం…నాకేం భయ్యం’ అనే ఆసక్తికర టైటిల్‌తో మనముందుకు వస్తున్నాడు నరేష్. అయితే ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ చూశాక మాత్రం ఈ సినిమాలో కూడా టైటిల్ ఒక్కటే ఆసక్తికరంగా ఉంటుందేమో అన్న అనుమానం వస్తోంది. ఊరవతల ఓ ఫాం హౌసో, గెస్ట్ హౌసే, లేక వేరే ఏదో హౌస్ అన్న ఓ రొటీన్, రెగ్యులర్, ఎన్నో సినిమాల్లో..ఎందరో దర్శకులు ఉతికి ఆరేసిన కాన్సెప్ట్. ఇక ఆ గెస్ట్ హౌస్‌లో ఓ దెయ్యం. ఆ దెయ్యాన్ని భయపెట్టడానికి వచ్చే మంత్రగాడి పాత్రలో వచ్చిన అల్లరి నరేష్… ఆ దెయ్యాన్ని చూసి జడుసుకోవడం…చుట్టూ ఉన్న కమెడియన్స్ ముందు కవర్ చేసుకోవడం, ఆ కమెడియన్స్ కూడా భయపడుతూ ఉండడం….టీజర్ మొత్తం మీద ఒక్క కొత్త షాట్ కానీ, ఆసక్తికరంగా అనిపించే, లేక నవ్వించే ఒక్క డైలాగ్ కూడా లేకుండా బహు జాగ్రత్తగా, అత్యంత అనాసక్తికరంగా రూపొందించారు ఈ టీజర్ ని. ది బెస్ట్ అనుకుని రిలీజ్ చేసిన ఒక్క నిమిషం టీజర్ ఇలా ఉంటే ఇక సినిమా బాగుంటుందన్న నమ్మకం ఎవరికి మాత్రం కలుగుతుంది?