కోర్టు రూమ్ డ్రామాలు బాలీవుడ్ వాళ్లకు కొత్తేం కాదు. మనం ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. `వకీల్ సాబ్` వచ్చేస్తే… కోర్టు రూమ్ డ్రామాలోని మజా తెలుస్తుంది. అంతకంటే ముందు `నాంది`తో ఈ జోనర్ కి నాంది పలకబోతున్నాడు అల్లరి నరేష్.
అల్లరోడి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఆశిస్తాం. తన బ్రాండూ అదే. కానీ తొలిసారి.. ఓ సీరియస్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. అదే నాంది. చేయని నేరానికి ఐదేళ్ల నుంచీ ఊచలు లెక్కేస్తున్న ఓ అమాయకుడి కథ ఇది. తనని ఓ మర్డర్ కేసులో ఎలా ఇరికించారు? అందులో ఎలా నలిగిపోయాడు? ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు? చివరికి ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని మహేష్ బాబు విడుదల చేశారు.
రాజగోపాల్ అనే ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ నేరం.. సూర్య ప్రకాష్ అనే అమాయకుడిపై పడుతుంది. ఐపీసీ సెక్షన్లు, అందులోని లొసుగులూ.. ఈ అమాయకుడ్ని ఎలా బలిగొన్నాయి? అనేది తెరపై చూడాలి.
“ఇక్కడి చట్టాలు చేతకానివాడిపై వాడడం కోసమే. పవర్లో ఉన్నవాడ్ని ఏం పీకలేవు“ అనే డైలాగ్ తో.. ఈ సినిమా కథేంటో అర్థమైపోతుంది. హీరోని కాపాడాలని ప్రయత్నించే లాయర్ గా శరత్ కుమార్ వరలక్ష్మి నటిస్తోంది. కొత్తగా ఏదో చేయాలన్న తపన నరేష్‌లో కనిపిస్తోంది. ఈసినిమా కోసం తాను బాగా కష్టపడ్డాడు అన్న విషయం అర్థం అవుతోంది. కాకపోతే.. ఈమధ్య నరేష్‌కి అన్నీ ఫ్లాపులే. `నాంది` కూడా అటూ ఇటూ అయితే.. కెరీర్ మరింత ప్రమాదంలో పడిపోతుంది. అందుకేనేమో.. చివర్లో “అందరూ నా జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు… ఇప్పుడే మొదలైంది“ అనే డైలాగ్ చెప్పించారు. నరేష్ కెరీర్‌కి ఇది సరికొత్త నాంది అయితే అంతకంటే కావల్సిందేముంది? ఈనెల 19న ఈ చిత్రం విడుదల కానుంది.