2017లో న్యూటన్ అనే హిందీ సినిమా వచ్చింది. భలే కొత్త థాట్. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా అది. రాజ్‌కుమార్ రావు హీరోగా నటించాడు. ఎలక్షన్ డ్యూటీకి మారుమూల గ్రామానికి వెళ్లిన ఓ ఉద్యోగి కథ ఇది. అక్కడ కొంతమంది బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లిపోతారు. వాటిని హీరో తిరిగి ఎలా తెచ్చుకున్నాడన్నదే కథ. చాలా సింపుల్ కథే అయినా.. ఇందులో చాలా విషయాల్ని సున్నితమైన హాస్యంతో చర్చించాడు దర్శకుడు. 10 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి దాదాపు 90 కోట్ల మార్కెట్ జరిగింది. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఆస్కార్ కి వెళ్లింది.
ఇదంతా ఎందుకంటే… ఇప్పుడు తెలుగులో అల్లరి నరేష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆనంది హీరోయిన్. ఈ సినిమా కథ కూడా ఇంచుమించుగా `న్యూటన్`లానే ఉంటుందని టాక్. హీరో ఈ సినిమాలో ఎన్నికల అధికారి. ఎలక్షన్ నిర్వహించడానికి ఓ ఊరుకెళ్తాడు. అక్కడ ఈసారి బ్యాలెట్ బాక్సుని కాదు, ఏకంగా ఎన్నికల అధికారినే కిడ్నాప్ చేస్తారు. ఆ తరవాత.. ఏమైందన్నదే కథ. సున్నితమైన హాస్యంతో నడిచే కథే అయినా, ఇందులోనూ బలమైన ఎలిమెంట్స్ చెప్పబోతున్నార్ట. ఓ సోషల్ మెసేజ్‌ని కామెడీ టచ్‌తో చెప్పబోతున్నారని తెలుస్తోంది. న్యూటన్ కథకి అటూ ఇటూగా ఉన్న కథ ఇది. రీమేకా.. ఫ్రీమేకా అనేది చిత్ర బృందమే చెప్పాలి. `నాంది` తరవాత.. నరేష్ లో కొత్త జోష్ వచ్చింది. రెగ్యులర్ కామెడీ కథలు చేయడం లేదు. ఏదైనా బలమైన సందేశం ఉంటేనే చేయడానికి ఒప్పుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ కథ ఓక చేశాడు.