అల్లరి నరేష్ కెరీర్లో అతి పెద్ద విజయం ‘సుడిగాడు’ సినిమాతో దక్కింది. కమర్షియల్ గా నరేష్ కెరీర్లో పెద్ద సక్సెస్ ఇది. అయితే అనూహ్యంగా సుడిగాడు తరవాత నరేష్ సినిమాలన్నీ ఫ్లాపులే. ‘నాంది’ వరకూ హిట్టు చూసిందే లేదు. ‘నాంది’తో రూటు మార్చిన నరేష్ సీరియస్ కథలవైపు దృష్టి పెట్టాడు. అయితే ఇప్పటికీ వింటేజ్ నరేష్‌ని చూడాలని చాలామందికి ఉంటుంది. సీరియస్ సినిమాల వల్ల భారీ విజయాలు రావని నరేష్ కూడా గ్రహించాడు. అందుకే తన మార్క్ కామెడీ సినిమాల్నీ చేద్దామని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా ‘సుడిగాడు 2’ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఫిక్సయిపోయాడు. ‘సుడిగాడు’ వచ్చినప్పుడే ‘సుడిగాడు 2’ కూడా చేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే స్పూఫ్లకు కొంతకాలం దూరంగా ఉండాలని ఫిక్సయిన నరేష్ ‘సుడిగాడు 2’ స్క్రిప్టు పక్కన పెట్టాడు. ఇప్పుడు దానికి మెరుగులు దిద్ది పట్టాలెక్కించాలన్నది ప్లాన్.
2026లో ‘సుడిగాడు 2’ ఉంటుందని నరేష్ ప్రకటించేశాడు కూడా. అయితే ‘సుడిగాడు’ టైమ్ కీ ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా కామెడీ విషయంలో. సోషల్ మీడియా విపరీతంగా పెరిగింది. అందులో ఉన్న కామెడీ అంతా ఇంతా కాదు. దానికి మించిన స్పూఫ్‌లు సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. ఓ సినిమా రాగానే… ట్రోలింగ్ సోషల్ మీడియాలో మొదలైపోతోంది. దాన్నే మళ్లీ స్క్రీన్ పై చూడడం కిక్ ఉండదు. ట్రోలర్స్ కీ, మీమర్స్ కీ మించిన కామెడీ ఏదో తెరపై చూపిస్తే తప్ప ‘సుడిగాడు 2’ వర్కవుట్ అవ్వదు. ఆ భయాలు నరేష్‌కూ ఉన్నాయి. అందుకే ఈ స్క్రిప్టుపై కనీసం ఆరు నెలలు కూర్చోవాలని ఫిక్సయ్యాడు. సుడిగాడు చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. సీక్వెల్ కీ ఆయనే వస్తారా, లేదంటే యంగ్ డైరెక్టర్ చేతిలో ఈ స్క్రిప్టు పెడతారా? అనేది చూడాలి. ఎందుకంటే… భీమనేని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఫామ్ లోనూ లేరు. ‘సుడిగాడు’ తరవాత ఆయనకూ హిట్ పడలేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భీమనేని ని నమ్మడం అంత ఈజీ కాదు. కామెడీని హ్యాండిల్ చేయగలిగే దమ్మున్న యువ దర్శకుడ్ని నరేష్ వెదికి పట్టుకోవాలి. ‘సుడిగాడు 2’ స్క్రిప్టు కంటే అదే ముఖ్యం.