ఇండస్ట్రీలో ఏ కథపై ఎవరి పేరు రాసుందో సెట్స్ పైకి వెళ్లి, రిలీజ్ వరకూ చెప్పలేం. ఒకరికోసం అనుకున్న కథ.. మరో హీరోకి వెళ్ళిపోవడం, ఒకరు వద్దనుకున్న కథ మరొకరు పట్టుకోవడం జరుగుతుంటుంది. ప్రియదర్శి ‘డార్లింగ్’ విషయంలో ఇదే జరిగింది.
డార్లింగ్ కథ ఇప్పటిది కాదు. 2018లో ఈ కథ ప్రియదర్శికి చెప్పాడు దర్శకుడు అశ్విన్ రామ్. అప్పటికి ప్రియదర్శికి హీరోగా మార్కెట్ లేదు. తర్వాత ఈ కథ అల్లరి నరేష్ దగ్గరికి వెళ్ళింది. రాజేష్ దండా నిర్మాణంలో అంతా ఫిక్స్ అనుకున్నారు. అయితే నరేష్ కి సెకండ్ హాఫ్ నచ్చలేదు, కొన్ని మార్పులు చెప్పారు. ఆ మార్పులు దర్శకుడికి నచ్చలేదు. దీంతో డ్రాప్ అయ్యారు.
మళ్ళీ తిరిగి తిరిగి కథ ప్రియదర్శికి చేరింది. బలగం తర్వాత ఆయనకి కొంత మార్కెట్ వచ్చింది. ఆయన హీరోగా నిర్మించడానికి ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ ముందుకొచ్చింది. అలా డార్లింగ్ ప్రియదర్శి ఖాతాలో పడింది.
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అంత పాజిటివ్ రిపోర్ట్ లేదు. కామెడీ వర్క్ అవుట్ కాలేదనే రివ్యూలు వచ్చాయి. ఈ లెక్కన డార్లింగ్ ని నరేష్ తెలివిగా వదిలించుకున్నాడనే అనుకోవాలి.