నరేష్ ఖాతాలో తాజాగా మరో ఫ్లాప్ చేరిపోయింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సెల్ఫీ రాజా కూడా నరేష్ ని ఏమాత్రం కరుణించలేదు. కథే కాదు, ఈ సినిమాలో కామెడీ కూడా లేకపోవడం, స్నూఫ్‌లు పేలకపోవడం, దర్శకత్వ లోపం… ఇవన్నీ కలిసి నరేష్‌ని మరోసారి ముంచేశాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టుకొట్టాలని తాపత్రయ పడిన నరేష్ ఆశలపై సెల్ఫీ రాజా నీళ్లు చల్లాడు. వరుస ఫ్లాపులతో కొట్టిమిట్టాడుతున్న నరేష్‌కి ఇది పెద్ద దెబ్బ. సుడిగాడు తరవాత నరేష్‌కి ఒక్క హిట్టు కూడా లేదు. ఆఖరికి సొంత బ్యానర్లో చేసిన ఇంద్రగంటి సినిమా బందిపోటు కూడా దారుణంగా నిరాశ పరిచింది.
ఈ దశలో నరేష్ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకొన్నాడు. నలుగురైదుగురు యువ రైటర్స్‌ని పట్టుకొని.. డైలాగ్స్ రాయించుకొన్నాడు. కొత్త పంచుల కోసం తాపత్రయపడ్డాడు. ఆఖరికి వదిలేసిన స్నూఫ్లను కూడా మళ్లీ పట్టుకొని వేలాడాడు. అయినా సరే.. సెల్పీ రాజా కనికరించలేదు. నరేష్ మూస ధోరణి నుంచి బయటకు వస్తే తప్ప అతనికి హిట్టు పడేట్టు లేదు. కథలు, దర్శకుల్ని ఎంపిక చేసుకోవడంలో నరేష్ పాత పొరపాట్ననే పునరావృతం చేస్తున్నాడు. నరేష్ కేవలం తన సినిమాల సంఖ్య పెంచుకోవడానికో, పారితోషికం కోసమో సినిమాలు చేస్తున్నాడన్న విమర్శ కూడా వినిపిస్తోంది. నిజానికి నరేష్ కి ఇప్పుడు అంత ఛాయిస్ లేదు. వచ్చిన సినిమాల్ని చేసుకొంటూ వెళ్లడమే తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఒకవేళ ‘నాకు ఈ కథ నచ్చలేదు’ అని తిప్పి పంపించినా.. ఆ కథని మరో హీరో ఎగరేసుకుపోవడానికి రెడీగా ఉన్నాడు. అందుకే నరేష్‌కి సినిమా ఒప్పుకోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండా పోతోంది. ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక సినిమా చేస్తే పోలా.. అనే ధోరణికి నరేష్ వచ్చేసినట్టు కనిపిస్తున్నాడు. ఈ వైఖరి మార్చుకొంటే తప్ప నరేష్ మళ్లీ హిట్టు బాట పట్టడు. ఇది వరకు సన్నివేశాల ద్వారా కామెడీ పండించడానికి ట్రై చేసిన అల్లరోడు ఇప్పుడు కేవలం పంచ్లనూ, స్నూఫ్లనే నమ్ముకొంటున్నాడు. ఈ మాయలోంచీ అల్లరోడు బయట పడాలి. లేదంటే అల్లరిపాలు కాక తప్పదు.