ఈవీవీ మంచి దర్శకుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా పతాకంపై ఆయన కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో పడి సతమతమవుతున్న ఈవీవీకి… తన సొంత బ్యానరే మళ్లీ నిలబెట్టింది. ఈవీవీ చనిపోయాక ఆ సంస్థ పేరు మీద మంచి సినిమాల్ని తీయాలని తనయుడు నరేష్ కంకణం కట్టుకొన్నాడు. తాను నిర్మాతగా అందించిన ‘బందిపోటు’ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాతో నరేష్ చాలా నష్టపోయాడు. ఇక ఆ దెబ్బతో నిర్మాణం జోలికి వెళ్లలేదు నరేష్. ప్రొడక్షన్ పేరు ఎప్పుడు ఎత్తినా.. ‘ఇప్పట్లో లేదు..’ అని ఖరాఖండీగా చెప్పేసేవాడు. అయితే ఇప్పుడు మళ్లీ నరేష్‌కు ఈవీవీ బ్యానర్‌ని బయటకు తీయాలని అనిపిస్తోంది. ఓటీటీల రూపంలో మరో వేదిక దొరికింది కాబట్టి… ఇప్పుడు చిత్ర నిర్మాణం మరింత సౌలభ్యంగా మారింది. అందుకే నరేష్ ఈవీవీ సినిమాపై చిత్రాలు నిర్మించడానికి రెడీ అయ్యాడని టాక్. ఈసారి నిర్మాణ బాధ్యతలన్నీ సోదరుడు ఆర్యన్ రాజేష్‌కి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఓ స్క్రిప్టుని నరేష్ లాక్ చేశాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చు. ఈ ప్రయత్నం గనుక సఫలీకృతం అయితే… ఇక నుంచి తన సొంత బ్యానర్లో యేడాదికి ఓ సినిమా, ఓ వెబ్ సిరీస్ చేయాలని భావిస్తున్నాడట. ‘నాంది’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన నరేష్, నిర్మాతగానూ విజయాల బాట పడతాడేమో చూడాలి.