నరేష్ అంటే అల్లరి .. అల్లరి అంటే నరేష్. కితకితలు పెట్టకుండానే నవ్వించడంలో ఈ కత్తి కాంతారావు స్టైలే వేరు. హాస్య కథానాయకుడిగా తనదైన ముద్ర వేసిన నరేష్ – గమ్యం లాంటి చిత్రాలలో భావోద్వేగ భరితమైన పాత్రలలో ఆకట్టుకున్నాడు. మహర్షిలో ఓ కీలకమైన పాత్ర పోషించి – తనలోని రెండో కోణాన్ని ఆవిష్కరించాడు. తన కొత్త సినిమాలు బంగారు బుల్లోడు, నాంది – ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రేపు (మంగళవారం) నరేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తెలుగు 360 తో స్పెషల్ చిట్ చాట్ చేశారు నరేష్.
* సెట్ మొహం చూసి చాలా కాలం అయినట్టుంది.. షూటింగులకు దూరమై బోర్ కట్టలేదా?
– మార్చి 12న సెట్ కి వెళ్లాను. అప్పటి నుంచి షూటింగుల మాటే లేదు. మళ్లీ ఆ హడావుడి ఎప్పుడు మొదలవుతుందా? ఎప్పుడు షూటింగ్‌కి వెళ్తానా? అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా. నా కెరీర్లో ఇది వరకు కొన్ని సార్లు గ్యాప్ వచ్చింది. కానీ చేతిలో సినిమాలు ఉండి కూడా.. సెట్‌కి వెళ్లకపోవడమే కొత్తగా ఉంది. నాదే కాదు. అందరిదీ ఇదే పరిస్థితి. ఇక బోర్ అంటారా? ఇంట్లోనే ఉంటూ.. ఇంట్లోవాళ్లతోనే కాలక్షేపం చేస్తున్నాను. ఇదో రకమైన అనుభవం.
* అన్నీ బాగుంటే మీ రెండు సినిమాలూ ఈ వేసవిలో వచ్చేసేవేమో?
– బంగారు బుల్లోడు రెడీ అయిపోయింది. నాంది మరో పది రోజులు షూటింగ్ చేస్తే పూర్తయిపోతుంది. వేసవి నాకు బాగా కలిసొచ్చిన సీజన్. వేసవిలో విడుదలైన నా సినిమాలన్నీ బాగా ఆడాయి. ఆ లెక్కన చూస్తే.. ఓ మంచి సీజన్‌ని మిస్ చేసుకున్నా.
* పరిమితుల మధ్య షూటింగ్ చేసుకోవడం సాధ్యమేనంటారా?
– కాస్త కష్టమే. `నాంది` మరో పది రోజులు షూటింగ్ బాకీ. కొన్ని సన్నివేశాలు 200 జూనియర్ ఆర్టిస్టుల మధ్య తెరకెక్కించాలి. ఇప్పుడున్న పరిస్థితులలో అది కష్టం. అలాగని ఆ సన్నివేశాన్ని మార్చి రాసుకోలేం. అలా చేస్తే ఇంపాక్ట్ పూర్తిగా తగ్గిపోతుంది. పరిస్థితులన్నీ చక్కబడి, అందరూ హ్యాపీగా షూటింగ్ చేసుకునేంత వరకూ అలాంటి సన్నివేశాల్ని ఊహించలేం. సోలో సీన్లు, ఒకరిద్దరు ఆర్టిస్టులతో నడిచిపోయే సీన్లూ తీసుకోగలం. ఫైట్లు, గ్రూపు పాటల గురించి మర్చిపోవడం మంచిది.
* థియేటర్లు ఓపెన్ అయినా జనం వచ్చే అవకాశం ఉందా?
– ఏమాత్రం లేదు. అందరి మాటా ఎందుకు,..? నేనే నా ఫ్యామిలీతో సినిమాకి వెళ్లలేను. వాక్సిన్ వచ్చేంత వరకూ జనం భయపడతూనే ఉంటారు. థియేటర్లు తెరచుకోవడం ఇప్పట్లో కష్టమే. థియేటర్లే లేనప్పుడు షూటింగులు చేసి ఏం లాభం?
* లాక్ డౌన్ సమయంలో మీకూ ఓటీటీకి అంకితం అయిపోయారా?
– ఓటీటీలో చాలా వెబ్ సిరీస్‌లు చూశా. కొన్ని నచ్చాయి కూడా. అయితే.. అది కూడా సినిమా లాంటిదే. సంవత్సరానికి 200 సినిమాలు విడుదలైతే అందులో 20 ఆడతాయి. ఓటీటీలోనూ అంతే. అందులో వచ్చిన ప్రతీ వెబ్ సిరీస్ బాగుంటుందా? వాటిలోనూ చెత్త చాలా ఉంటుంది. జనం కూడా ఫ్రీగా వచ్చింది కదా అని ఎగబడి చూసేయ్యరు. బాగుంటేనే చూస్తారు. సినిమా అయినా, ఓటీటీ అయినా కంటెంట్ ముఖ్యం.
* మీ రెండు సినిమాలూ ఓటీటీకి వెళ్లే ఛాన్సుందా?
– లేదండీ. అవి థియేటర్లోనే విడుదల అవుతాయి. ఎందుకంటే సినిమా బడ్జెట్‌కీ, ఓటీటీ బడ్జెట్‌కీ సంబంధం లేదు. మరో మార్గం లేదు కదా అని తక్కువ రేటుకి ఓటీటీకి అమ్ముకోలేం. అందరూ ఇప్పుడు ఓటీటీ గురించి మాట్లాడుతున్నారు. వాటి ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. అయితే… అది ఓ బుడగ లాంటిది. ఎప్పుడు పేలుతుందో చెప్పలేం.
* బాలయ్య టైటిల్ బంగారు బుల్లోడు ని లాగేసుకున్నారు. కారణమేంటి?
– నిజానికి ఈ సినిమాకి బాబు బంగారం అనే టైటిల్ కరెక్ట్. కానీ ఆ పేరుతో సినిమా వచ్చి ఎంతో కాలం అవ్వలేదు. అందుకే బంగారు బుల్లోడు అనే పేరు పెట్టాం. ఈ సినిమాలో హీరో బంగారు పని చేస్తుంటాడు. కథ కూడా బంగారం చుట్టూ తిరుగుతుంది.
* నాంది ఫస్ట్ లుక్‌తో షాక్ ఇచ్చారు. నగ్నంగా నటించాలి అనుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?
– నేనే షాక్ తిన్నా. ఆ సీన్ చూసుకున్నాక నాపై నాకు జాలి వేసింది. కానీ కథ ప్రకారం ఆ సీన్ అలా తీయడం కరెక్ట్. ఆడియన్స్ కూడా ఆ పాత్రపై ఓరకమైన జాలి చూపించాలి. అప్పుడే కథకు కనెక్ట్ అవ్వగలరు.
* నాందిలో ఇలాంటి షాక్‌లు ఇంకేమైనా ఉన్నాయా?
– కథ షాకింగ్ గా ఉంటుంది. వందమంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్నా ఫర్లేదు గానీ, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని చెబుతారు. కానీ సమాజంలో అలా జరగడం లేదు. ఎంతోమంది చేయని నేరానికి బలైపోతున్నారు. అలాంటి ఓ అభాగ్యుడి కథ. ఈమధ్య జరిగిన కొన్ని వాస్తవ ఘటనలు కూడా తెరపై కనిపిస్తాయి.
* మహర్షిలో ఓ కీలకమైన పాత్ర చేశారు. అయితే ఆ సినిమా విజయంలో మీకు సరైన వాటా వచ్చిందనే భావిస్తున్నారా?
– అందులో అనుమానాలేం లేవు. `నాంది` లాంటి కథ నా దగ్గరకు రావడానికి కారణం.. మహర్షి సినిమానే. నిజానికి నా దగ్గరకు అన్నీ కామెడీ కథలే వస్తాయి. కానీ `నాంది` సీరియస్ కథ. ఇలాంటి కథలో నన్నెలా ఊహించుకున్నావు? అని దర్శకుడిని అడిగాను. `మహర్షి చూశాక.. ఈ కథకు మీరే సరైన కథానాయకుడు అనిపించింది` అన్నాడు దర్శకుడు. నాలో ఓ కొత్త కోణాన్ని `మహర్షి` బయటపెట్టింది.
* ఇలాంటి పాత్రలు చేస్తారా?
– తప్పకుండా చేస్తా. నాది పది నిమిషాల పాత్ర అయినా ఫర్వాలేదు. కానీ విషయం ఉండాలి. మహర్షిలో నేను హీరో కాకపోవొచ్చు. కానీ నా వల్ల కథ మలుపు తిరుగుతుంది. అలాంటి కథలొస్తే.. నేను రెడీనే.
* ఈవీవీ బ్యానర్లో సినిమాలు కొనసాగించే అవకాశం ఉందా?
– ప్రస్తుతానికి లేదండీ. ఎందుకంటే ఈవీవీ పేరు పెట్టామంటే కథలో, వినోదంలో ఆయన బ్రాండ్ కనిపించాలి. లేదంటే అస్సలు ఆ ప్రయత్నమే చేయకూడదు. అలాంటి కథ ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే సినిమా చేస్తా. చేయకపోయినా వచ్చే నష్టమేమీ లేదు.