అల్లరి నరేష్ చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కామెడీని పక్కన పెట్టి వరుసగా సీరియస్ కథలపై దృష్టి పెట్టారు. అయితే తనలోని నటుడిని సంతృప్తి పరిచే హిట్ పడటం లేదు. ఇటివలే బచ్చలమల్లితో నిరాశ పడ్డ నరేష్ ఇప్పుడు పొలిమేర టీంతో జతకట్టారు. పొలిమేర మేకర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా అల్లరి నరేష్ ఓ సినిమా చేస్తున్నారు. నాని డైరెక్టర్. ఈ సినిమాకి ’12A రైల్వే కాలనీ’ అనే టైటిల్ పెట్టారు.
టైటిల్ టీజర్ ఆసక్తికరంగానే వుంది. నరేష్ ఓ కిటికీ వద్దకి వచ్చి ఎదో ధ్యానం చేసినట్లు నిలబడటం, తర్వాత తెరపైకి వచ్చిన కొన్ని మార్మిక సన్నివేశాలు, వైవా హర్ష చెప్పిన ఆత్మలు డైలాగు.. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచేలా చేశాయి. నరేష్ లుక్ కొత్తగా వుంది. పొలిమేర తరహలో ఇది కూడా క్షుద్ర శక్తుల నేపధ్యంలో సాగే కథే. నటన పరంగా నరేష్ కి ఓ కొత్తకోణం చూపించే అవకాశం వున్న సినిమా అనిపిస్తోంది. ఈ వేసవిలోనే సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.