‘ఆ ఒక్కటీ అడక్కు’… ఈవీవీ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. ఇప్పుడు అల్లరి నరేష్… ఆ టైటిల్ ని తన సినిమాకి వాడేసుకొన్నాడు. నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రమిది. మల్లి అంకం దర్శకుడు. మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈరోజు నాని చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది.
కథానాయకుడి పెళ్లి పాట్లు.. ఈ సినిమా. 49 సంబంధాలు చూసినా, ఒక్కటీ సెట్ కాదు. ఇంతలో ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. వెంటనే హీరో ప్రేమలో పడిపోతాడు. కానీ ఆ అమ్మాయికి పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం ఉండదు. మరి ఈ జంట కలిసేదెలా..? ఇదే – ఆ ఒక్కటీ అడక్కు కథ. టీజర్, ట్రైలర్లోనే కథేంటో చెప్పేశారు. పెళ్లికాని ప్రసాదు టైపు గాథలు చాలా చూసేశాం. ఇదీ అలాంటిదే. కాకపోతే.. నరేష్ ఈ టైపు స్టోరీలు ఎప్పుడూ చేయలేదు. నరేష్ ఈమధ్య కాస్త సీరియస్ టచ్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. మళ్లీ తనదైన పంథాలో వెళ్లి ఎంచుకొన్న కథ ఇదనిపిస్తోంది. పెళ్లి – దాని చుట్టూ నడిచే డ్రామా ఎప్పటికీ ఎవర్ గ్రీనే. కాబట్టి… బాక్సాఫీసు దగ్గర అల్లరోడికి ఢోకా లేదనిపిస్తోంది. నరేష్ లుక్ డీసెంట్‌గా ఉంది. ఓవర్ ద బోల్డ్ కామెడీ క్యారెక్టర్ కాదిది. సెటిల్డ్‌గా చేశాడు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, రఘుబాబు.. ఇలా కామెడీ గ్యాంగ్ బాగానే ఉంది. అబ్బూరి రవి అందించిన సంభాషణలు అదనపు ఆకర్షణ. నరేష్ తో పోటీగా ఫరియా కూడా కామెడీ పండించినందన్న భరోసా ట్రైలర్ ఇచ్చేసింది. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. కామెడీ చిత్రాలకు మళ్లీ పూర్వ వైభవం వస్తున్న ఈ తరుణంలో అల్లరోడి సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.