సునీత అనే జూనియర్ ఆర్టిస్ట్ కత్తి మహేష్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీవీ9 ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో విమర్శల పాలైంది. కత్తి మహేశ్ తన పై బలాత్కారం చేయబోయాడని, ఈ విషయం చెప్పడానికి మీ (టీవీ9) దగ్గరకు వస్తే పట్టించుకోలేదని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించగా, వెంటనే ఆమె ని డిబేట్ నుంచి తప్పించి, కత్తి మహేష్ వెర్షన్ ని మాత్రం ప్రసారం చేయడం తో టివి9 పై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడ్డారు. అయితే ఈ క్రమం లో తెలుగు360 ఆర్టికల్లో రాసిన కొసమెరుపు వాక్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా కావడం గమనార్హం . ( https://www.telugu360.com/te/casting-couch-shock-for-kathi-mahesh-in-live-tv/ ). అయితే టీవీ9 పై సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత రావడం సామాన్యులకే కాక బహుశా టీవీ9 కి కూడా కలిగించినట్టు ఉంది. దీంతో టీవీ9 నష్ట నివారణ చర్యలు చేపట్టిందేమో అన్న అనుమానాలు వచ్చేలా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే…
కత్తి మహేష్ పై సున్నిత అనే మహిళ టీవీ నైన్ లైవ్ లో ఆరోపణలు చేయడం, ఆరోపణలు చేసిన కాసేపటికి ఆమె ను డిబేట్ నుంచి తప్పించడం, ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి చెప్పిన ఆరోపణలు ప్రసారం చేయకుండా కేవలం కత్తి మహేష్ ఖండించడం ప్రసారం చేయడం,దీనికి తోడు సునీత కూడా టీవీ9, మహా టీవీ లపై కత్తి మహేష్ ని టీవీ9 కాపాడుతోందని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఈ పరిణామాలతో టీవీ9 క్రెడిబిలిటీ ప్రశ్నార్థకం అయింది. అయితే ఇలాగే వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిందో ఏమో టీవీ9 నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు గా కనిపిస్తోంది.సునీత ఏ మహిళ అయితే టీవీ9 పై ఆరోపణలు చేస్తూ వీడియో చేసిందో అదే మహిళ ఫేస్ బుక్ లో టీవీ9 పై ఆరోపణలు అవాస్తవమని మరొక కొత్త వీడియో చేసింది.
ఈ వీడియో లో- టీవీ9 వల్లే కత్తి మహేష్ నిజస్వరూపం బయటపడిందని, ఆ అవకాశం టీవీ9 మాత్రమే ఇచ్చిందని టీవీ9 ని వెనకేసుకొచ్చింది. టీవీ9 వాళ్ళు ఆధారాలకోసంబెదిరిస్తున్నారని గతంలో చెప్పిన సునీత దానిపై ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది. కేవలం మహా టీవీ వాళ్ళు మాత్రమే బెదిరించారని టీవీ9 వాళ్లు అస్సలు బెదిరించలేదని చెప్పుకొచ్చింది. దయచేసి టీవీ9 ని నెగిటివ్ చేయొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. కత్తి మహేష్ విషయంలో తనకు అండగా నిలబడింది టీవీ9 మాత్రమేనని నొక్కి వక్కాణించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీవీ9 ని నెగిటివ్ చేయొద్దని మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేసింది. అలాగే కత్తి మహేష్ టీవీ9 కి వచ్చి జనసేన పై కానీ మెగా ఫ్యామిలీ పై కానీ ఆరోపణలు చేయకుండా తాను చూసుకుంటానని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో మొత్తం చూసినవాళ్లకు ఒక విషయం అనుమానం వచ్చింది. సునీత తనకు జరిగిన అన్యాయం కంటే టీవీ9 ని నెగిటివ్చేయొద్దు అని పదేపదే విజ్ఞప్తి చేయడం చూస్తుంటే నష్టనివారణ చర్యల్లో భాగంగా టీవీ 9 వాళ్ళే సునీతతో ఈ వీడియో ఇప్పించారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి .పైగా కత్తి మహేష్ టీవీ 9 కి వచ్చి జనసేన, మెగా ఫ్యామిలీ పై విమర్శలు చేయకుండా చూద్దాం అని సునీత వీడియోలో చెప్పడం చూస్తుంటే పైకి ఇది మెగా ఫ్యాన్స్ ని అనునయించే ప్రయత్నం లాగా కనిపిస్తున్నప్పటికీ, పరిశీలిస్తే సునీత భవిష్యత్తులో చేసే ఆరోపణలకు బలమైన మద్దతు రాకుండా ఈమె మెగా ఫ్యామిలీ మనిషి అని ముద్ర వేసే వ్యూహం కూడా ఉందేమోనని నెటిజన్లు అనుమానిస్తున్నారు.
కత్తి మహేష్ విషయంలో తనకు అండగా టీవీ9 నిలబడిందని సునీత ఇప్పుడు చెబుతున్నప్పటికీ, సునీత చేసిన ఆరోపణలపై టీవీ9 ఆ తర్వాత ఎటువంటి చర్చలు చేపట్టకపోవడం, సునీత ఆరోపణలను స్క్రోలింగ్ వేయకుండా కేవలం కత్తి మహేష్ వెర్షన్ మాత్రమే స్క్రోలింగ్ చేయడం అందరికీ అర్థమైన విషయాలే. కాబట్టి ఈ వీడియో టీవీ9 నష్ట నివారణ చర్యల్లో భాగంగా వచ్చిందేమోనన్న సందేహాలు మాత్రం అందరికీ కలుగుతున్నాయి. ఏదిఏమైనా సోషల్ మీడియా సెగ టీవీ గట్టిగా తగిలినట్టు అర్థమవుతోంది