ఏపీలో టీడీపీని ఎన్డీఏలోకి తీసుకు వచ్చేందుకు బీజేపీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా జాతీయ మీడియా మరోసారి చెబుతోంది. అయితే చంద్రబాబు చెప్పిన అంశాలపై మాత్రం ఎటూ తేల్చకపోవడంతోనే పీట ముడి పడినట్లయింది. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని వాటిపై కేంద్రం చర్యలు తీసుకోవాల్సిందేనని చంద్రబాబు పట్టుబడుతున్నారు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ అయ్యారు. తర్వాత వారు ఏపీలో బహిరంగసభలు పెట్టి వైసీపీని విమర్శించారు. రాష్ట్రంలోనూ వైసీపీపై బీజేపీ నేతలు యుద్ధం ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్డీఏలో చేరడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
గత వారం టీడీపీ అధినేత కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. అది సుదీర్ఘమైన లేఖ. 9 పేజీల్లో తన ఏపీ ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలతో పాటు తనపై జరిగిన ఉద్దేశపూర్వక దాడులు, హత్యాయత్నాల కుట్రలు చెబుతూ.. తన ప్రాణానికీ ముప్పు ఉందన్న సందేశం పంపారు. దీనికి సాక్ష్యంగా 70పేజీలకుపైగా డాక్యుమెంట్లు, వీడియోలు పంపించారు. వీటిపై చర్యలు తీసుకుంటారని చంద్రబాబు ఆశిస్తున్నారు. తాను రాసిన లేఖలో ఉన్న అంశాలపై కేంద్రం స్పందిస్తే.. ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు అంగీకరించే అవకాశం ఉంది.
వైసీపీని మిత్రునిగా బీజేపీ చూడలేకపోతోంది. రాజకీయం అంటే అవకాశ వాదం. కూటమిలో లేకపోతే.. వచ్చే ఎన్నికల తర్వాత ఎవరు ఏ వైపు ఉంటారో చెప్పడం కష్టం. ఢిల్లీలో తిప్పేందుకు చక్రం కోసమే చూస్తున్నామని అన్ని పార్టీలు చెబుతున్నాయి. దురదృష్టం కొద్దీ బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చిందని జగన్ కూడా ఓ సారి వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకం కానుంది.