ఓటీటీ.. పరిధి పెరుగుతోంది. చిత్రసీమని మెల్లమెల్లగా ఓటీటీ ఆక్రమించుకుంటోంది. నిర్మాతలకు ఇదో ప్రధాన ఆదాయ వనరుగా మారింది. థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ తన రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థలే… భారీ పెట్టుబడితో సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నాయి. సినిమాలకు మించి పెట్టుబడితో.. ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఓ ఓటీటీ సంస్థ ఏకంగా 170 కోట్లతో ఓ సినిమా ప్లాన్ చేస్తోందట. ఇందులో ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్నాడట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ చూచాయిగా చెప్పేశారు. “ఆ హీరో పేరు చెప్పను. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ ఓ ఓటీటీ సంస్థ కోసం ఓ సినిమా చేస్తున్నారు. దాని బడ్జెట్ 170 కోట్లపైన” అంటూ హింట్ ఇచ్చారు. భవిషత్తులో ఓటీటీ సంస్థలు ఎంత శక్తిమంతంగా మారబోతున్నాయో.. చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
“ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. కానీ.. ఏదొచ్చినా సరే, థియేటర్ల వ్యవస్థని నాశనం చేయలేదు. కేవలం ప్రత్యామ్నాయంగా మాత్రమే నిలబడుతుంది. ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడడాన్నే ఆస్వాదిస్తారు. త్వరలోనే మళ్లీ థియేటర్లకు మంచి రోజులు వస్తాయి” అన్న అశాభావం వ్యక్తం చేశారు అరవింద్.