చిరంజీవిపై తనకున్న ఇష్టాన్ని ప్రేమని మరోసారి బయటపెట్టాడు అల్లు అర్జున్. ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమనులంతా పవర్ స్టార్ – పవర్ స్టార్ అని సందడి చేస్తున్నా – బన్నీ ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. `మీ అందరి కోసం పవర్ స్టార్ పేరు ఒక్కసారి చెబుతా` అంటూనే చిరుపై తనకున్న అభిమానం చాటుకున్నాడు.
“నాకు చిరంజీవిగారంటే ప్రాణం. ఈ కట్ట కాలేంత వరకూ చిరంజీవి అభిమానిని” అంటూ సెంటిమెంటల్ టచ్ ఇచ్చాడు. అంతే కాదు.. ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న నాలుగు సినిమాలకూ తన శుభాకాంక్షలు అందించాడు. “చిరంజీవి గారి తరవాత నేను అభిమానించేది రజనీకాంత్. ఆయన నా రోల్ మోడల్. ఈ సంక్రాంతికి ఆయన సినిమా వస్తోంది. అది కూడా బాగుండాలి. మా సినిమాతో పాటుగా సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల అవుతోంది. మహేష్ బాబుకి ఆల్ ది బెస్ట్. కల్యాణ్ రామ్ గారి సినిమా ‘ఎంత మంచివాడవురా’ కూడా వస్తోంది. ఆ సినిమా కూడా బాగుండాలి. ఈ సంక్రాంతికి అందరూ సంబరాలు చేసుకోవాలి” అన్నాడు. నిన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మహేష్ బాబు ఈ సినిమాల్ని ప్రస్తావించడమే మర్చిపోయాడు. కానీ బన్నీ ఆ తప్పు చేయలేదు.