హీరోల్ని ప్రసన్నం చేసుకోవడమే నిర్మాతల పని. అంతకంటే పెద్ద అదృష్టం ఏముంటుంది? పైగా స్టార్ హీరోలు ఏం చెబితే అది చేయడానికే ఈవాల్టి నిర్మాత పుట్టాడు. ఎక్కడ హీరోగారికి కోపాలు వచ్చేస్తాయో అన్న నిర్మాతల పాలిటి భయాలే.. హీరోలకు రక్షణ కవచాలు. ఆయుధాలు. ఇది వరకు సెట్ వరకే హీరోల ఆధిపత్యం ఉండేది. క్రమంగా… బిజినెస్‌లోనూ, ఆఖరికి ప్రచారంలోనూ వాళ్ల మాట తు.చ తప్పకుండా పాటించాల్సివస్తోంది. `అల.. వైకుంఠపురములో` సినిమాకి అదే జరిగింది.
ఈ సినిమా హిట్టు నుంచి సూపర్ హిట్టు, బ్లాక్ బస్టర్ హిట్టు… ఆల్ టైమ్ ఇండ్రస్ట్రీ హిట్టు వరకు పరిగెట్టింది. సినిమాలో విషయం ఉంది కాబట్టి ప్రేక్షకులూ ఆశీర్వదించారు. దానికి మించి బన్నీ తన ప్రమోషన్లతో ఉక్కిరిబిక్కరి చేశాడు. ఇది వరకు బన్నీ ఏ సినిమాకీ చేయనటువంటి ప్రమోషన్లు.. ఈ సినిమాకి జరిగాయి. సినిమా విడుదలకు ముందు ఒక ఎత్తు. విడుదలైన తరవాత మరో ఎత్తు. దాదాపు పది ఈవెంట్లు. అన్నీ భారీగానే. దాని విలువ దాదాపు ఐదారు కోట్లు. ఈ సినిమా ప్రమోషన్లు లేకపోయినా నిలబడుతుంది. ఎందుకంటే మార్కెట్లో మరో సినిమా లేదు. పైగా ఫ్యామిలీ అంతా చూసే సినిమా కనిపించలేదు. దాంతో సంక్రాంతి తరవాత కూడా అల వైకుంఠపురములో హవా కొనసాగింది. దానికి బన్నీ ఇచ్చిన ప్రమోషన్లు ఎంత వరకూ వర్కవుట్ అయ్యాయో తెలీదు గానీ, ఈ పేరు చెప్పి నిర్మాతలకు 5 నుంచి 6 కోట్లు ఖర్చయ్యాయి. ప్రతీరోజూ పేపర్లోనో, టీవీలోనూ తమ సినిమా కనిపించాలన్న తపన బన్నీది. తన తపన అర్థం చేసుకోదగినదే. అయితే… ఆ బిల్లు మాత్రం నిర్మాతలే ఖర్చు పెట్టాల్సివచ్చింది. ఈ సినిమాలో గీతా ఆర్ట్స్ నిర్మాణ బాగస్వామి అయినప్పటికీ.. బిల్లు మాత్రం హారిక హాసిని కే వెళ్లిందని ఇన్ సైడ్ వర్గాల టాక్.
వాళ్లు కూడా `సినిమా ఎలాగో ఆడేస్తోంది కదా, పైగా హీరోగారు హర్టవుతారు` అని ఇష్టం లేకపోయినా.. ఈవెంట్లకు స్పానర్ చేస్తూనే ఉన్నారు మొన్న మీడియాకి పార్టీ ఇవ్వడంతో ఈ ప్రమోషన్ హంగామా ముగిసింది. దాంతో నిర్మాతలూ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే.. ఈ హవా ఇంకొన్ని రోజులు కొనసాగేది.