తమిళ కథ `96` తెలుగులో రీమేక్ చేయాలన్నది దిల్‌రాజు ప్రయత్నం. ఈ సినిమా గత కొద్ది రోజులుగా దిల్‌రాజుని బాగా డిస్ట్రబ్ చేస్తూ వస్తోంది. రీమేక్ రైట్స్ ఈజీగానే సొంతం చేసుకున్నాడు గానీ – తన కథకు తగిన కథానాయకుడ్ని వెదికి పట్టుకోవడం పెద్ద టాస్క్ గా మారింది. విజయ్ సేతుపతి పాత్రని రిప్లేస్ చేసే కథానాయకుడు దిల్‌రాజుకి కనుచూపుమేరలో కనిపించడం లేదు. అయితే… ఈ కథని మేం చేస్తాం.. అంటే మేం చేస్తాం అంటూ కొంతమంది హీరోలు కర్చీఫ్‌లు వేసుకోవడం మొదలెట్టారు. అందులో అల్లు అర్జున్, నాని ఇద్దరూ ఉన్నారు. బన్నీకి ఈ సినిమా బాగా నచ్చింది. బన్నీలాంటి స్టార్ యాడ్ అవుతుంటే… దిల్‌రాజుకి అంతకంటే కావాల్సింది ఏముంది? నాని కూడా సమర్థుడే.కాకపోతే… వాళ్ల వాళ్ల బలాలతో పాటు వాళ్లకంటూ కొన్ని పరిమితులున్నాయి. బన్నీకి అడుగడుగునా స్టార్ డమ్ అడ్డుపడుతుంటుంది. దాన్ని దాటుకుని వద్దామన్నా… విజయ్ సేతుపతిలా 40 ప్లస్ పాత్రలో కనిపించడం, కనిపించినా మెప్పించడం చాలా కష్టం. నాని కూడా అంతే. తను ఇప్పటికీ నూనూగు మీసాల కుర్రాడే. విజయ్ సేతుపతిలా బొద్దుగా మారలేడు. అందుకే హీరోలు రెడీగానే ఉన్నా దిల్‌రాజు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. నిజానికి బన్నీ, నానిలలో ఇద్దరూ ఈ పాత్రకు కరెక్ట్ కాదు. తమపై ఎలాంటి ఇమేజ్‌లేని హీరోలు, పాత్ర కోసం బాడీ షేప్‌ని ఎలాపడితే అలా మార్చుకునే నటులు కావాలి. ఒకవేళ అలాంటి హీరో దొరికినా – `96`లో విజయ్ సేతుపతి- త్రిషలు చేసిన ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేసేంత సమర్థుడైన దర్శకుడు దొరకాలి. వాళ్లని వెదికిపట్టుకోవడమే దిల్‌రాజుకి అది పెద్ద సవాల్.