వెండితెరపైన కామెడీని పండించడంలో మన డైరెక్టర్స్‌లో చాలా తక్కువమందే సక్సెస్ అయ్యారు కానీ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం తొంభైశాతం మందికి పైగా డైరెక్టర్స్ అద్భుతమైన కామెడీని పండిస్తూ ఉంటారు. కథ చెప్పడం స్టార్ట్ చేసిన పదినిమిషాల్లోనే హీరోగారు ఒకె చేశారు, ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చేసేశారు, హీరోయిన్‌తో సహా ఆర్టిస్ట్‌లందరూ కూడా ఈ గొప్ప కథలో, గొప్ప గొప్ప క్యారెక్టర్స్‌లో నటించడం కోసం ఎంతో కష్టపడ్డారు, ఎవ్వరూ కూడా రెమ్యూనరేషన్ కోసం డిమాండ్ చేయలేదు అని చెప్పడం దగ్గర్నుంచి మన డైరెక్టర్స్ కామెడీ స్టార్ట్ అవుతుంది. హీరోగారు అద్భుతంగా యాక్ట్ చేశారు, కష్టం అంటే ఏంటో ఆయనను చూసే నేను నేర్చుకున్నాను అని ఆ కామెడీని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళతారు. ఈ మాటలన్నీ విన్న ప్రేక్షకుడు విక్రమ్, సూర్య, అమీర్ ఖాన్, కమల్ హాసన్‌ల రేంజ్లో ఏదో ఊహించుకుంటాడు. అయితే ఆ అంచనాలను ట్రైలర్‌తోనే పాతాళానికి తీసుకెళ్ళిపోతాడు డైరెక్టర్. అక్కడంతా రొటీన్ మాస్ మసాలా స్టఫ్‌తో రచ్చ రచ్చే అనేలా ఉంటుంది మరి వ్యవహారం. సినిమా టైటిల్, టీజర్, ట్రైలర్, సాంగ్స్లాంటివేవీ తెలియకుండా కేవలం మనవాళ్ళ ప్రచార ప్రగల్భాలు విని థియేటర్లో అడుగుపెడితే మాత్రం ప్రేక్షకులకు మెంటలెక్కిపోవడం ఖాయం.
ఇప్పుడు కూడా ఓ అద్భుతమైన ప్రచార గిమ్మిక్ వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో రౌండ్స్ కొడుతోంది. ‘సరైనోడు’ సినిమాతో తనను కొత్తగా చూపించమేకాక, ఊరమాస్ సూపర్ హిట్ సినిమాని అందించిన బోయపాటి శ్రీను తర్వాత సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడు అన్నదే ఆ వార్త. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న బెల్లంకొండ వారి తరుపువాళ్ళయితే ఈ వార్తను ఖండించకపోగా బన్నీతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తాడని చెప్తున్నారు. ‘ఆది’ సినిమాతో తనకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కోసం గెస్ట్ రోల్ చేయడానికి ఎన్టీఆర్ ఒప్పేసుకున్నాడని చెప్తున్నారు. వినడానికి ఎక్సైటింగ్‌గా ఉంది, అంతా బాగానే ఉంది కానీ జరిగే అవకాశాలు మాత్రం కనీస మాత్రంగా కూడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ గెస్ట్ రోల్స్ వార్త బోయపాటి సినిమాకు మాంచి పబ్లిసిటీ తీసుకురావడానికి మాత్రమే పనికొస్తుందనడంలో సందేహం లేదు. బన్నీ విషయం ఎలా ఉన్నా రభస టైంలో తనను ఇబ్బందిపెట్టిన బెల్లంకొండ కోసం, దమ్ములాంటి ఫ్లాప్‌ని తన అకౌంట్లో వేసిన బోయపాటి శ్రీను కోసం ఎన్టీఆర్ ఎందుకు ముందుకు వస్తాడు? ఇప్పటి వరకూ చాలానే హిట్ సినిమాలు అందించినప్పటికీ బోయపాటిశ్రీనుకి రావాల్సినంత పేరు అయితే రాలేదు. పైగా చెడ్డపేరు మాత్రం బోలెడంత వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్, బన్నీలను గెస్ట్ రోల్స్‌కి ఒప్పించగలిగాడంటే మాత్రం బోయపాటి పేరు మారుమోగిపవడం ఖాయం. ఛాన్స్ ఉందంటారా?