ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి అట్లీతో, మరోటి త్రివిక్రమ్ తో. రెండు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ఆశించారు బన్నీ ఫ్యాన్స్. అనుకొన్నట్టుగానే అట్లీ సినిమాకు సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. కథేమిటో, ఎలాంటి సినిమానో స్పష్టంగా చెప్పకపోయినా ఫ్యాన్స్‌కు చూచాయిగా అర్థమయ్యేలా ఈ వీడియోని డిజైన్ చేశారు. మోషన్ క్యాప్చర్ సాంకేతికత ఉపయోగించుకొని, ఈ సినిమా రూపొందిస్తున్నట్టు వీడియో చూస్తే తెలిసిపోతోంది. ఈ వీడియో వచ్చి దగ్గర్నుంచి బన్నీతో అట్లీ ఏం చేయబోతున్నాడా? అనే ఆసక్తి నెలకొంది. బన్నీ, అట్లీలలో ఎవరో ఒకరు నోరు విప్పేంత వరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.
మరోవైపు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చింది. అయితే హారిక హాసిని సంస్థ కేవలం ఓ పోస్టర్ తో సరిపెట్టేసింది. పోస్టర్ పై బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు మినహాయిస్తే ప్రత్యేకంగా చెప్పుకొనేలా ఏం లేదు. జస్ట్ నామ్ కే వాస్తే.. అన్నట్టు ఓ డిజైన్ వదిలారంతే. అయితే.. త్రివిక్రమ్ దగ్గర ప్రస్తుతం ఇలాంటి అప్ డేట్లపై దృష్టి నిలిపేంత టైమ్ లేదు. ఆయన పూర్తిగా కథపై ఫోకస్ చేశారు. ఒకసారి అంతా సెట్ అయ్యాక… ఆయన కూడా వెరైటీగా ఓ వీడియో విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అప్పుడు సినిమా కాన్సెప్ట్ కూడా కొద్దిగా రివీల్ చేస్తారని తెలుస్తోంది.
కాకపోతే అట్లీతో చేస్తోంది అల్లు అర్జున్ కు 22వ సినిమా. అలాంటప్పుడు త్రివిక్రమ్ పోస్టర్‌పై కనీసం అల్లు అర్జున్ 23వ సినిమా అనే వివరం అయినా ఉండాలి. అది కనిపించలేదు. ప్రస్తుతం దాని గురించే ఫ్యాన్స్ ఆసక్తిగా మాట్లాడుకొంటున్నారు. అట్లీ తో సమాంతరంగా త్రివిక్రమ్ సినిమా కూడా చేస్తాడా, లేదంటే.. కాస్త గ్యాప్ తీసుకొంటాడా? అనే చర్చ ఇప్పుడు మళ్లీ మొదలైంది.