‘పుష్ప 2’ ప్రీమియర్ల సందర్భంగా హైదరాబాద్ సంధ్య ధియేటర్లో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి నివాళి అర్పిస్తూ అల్లు అర్జున్ ఓ వీడియో పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఆ కుటుంబానికి పాతిక లక్షల రూపాయల సహాయం ప్రకటించారు. అభిమాని మృతి కదిలించిందని, టీమ్ మొత్తం ఎమోషన్‌కి గురైందని, పుష్ప 2 సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేకపోయామని ఈ వీడియోలో పేర్కొన్నారు బన్నీ. కుటుంబానికి తమ మద్దతు ఎల్లావేళలా ఉంటుందని, తమ పరిధిలో ఏ సాయం కావాలన్నా చేస్తామని, ఎమోషనల్ గా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
”పుష్ప ప్రీమియర్ల కోసం సంధ్య థియేటర్లకు వెళ్లాం. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిందన్న వార్త తెలిసి మా టీమ్ అంతా షాక్‌లోకి వెళ్లాం. 20 ఏళ్లుగా అన్ని సినిమాలకూ మెయిన్ థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం ఓ ఆనవాయితీగా మారింది. ఎప్పుడూ ఘటన జరగలేదు. మేం సినిమా తీసేదే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని. కానీ అనుకోకుండా ఇలా జరిగింది. మేం ఏం చేసినా, ఎంత చేసినా ఈ నష్టాన్ని భర్తీ చేయలేం. ఆ కుటుంబానికి ఏం కావాలన్నా మేం అండగా ఉంటాం. నా తరపునుంచి రూ.25 లక్షలు ప్రకటిస్తున్నా. నన్ను నమ్మండి. నేను మీ కోసం ఉన్నా అని చెప్పడానికే ఈ సహాయం. పిల్లలకు సహాయం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. పాతిక లక్షలు కాకుండా.. ఆసుపత్రి ఖర్చులు కూడా నేనే భరిస్తా. నాదొకటే విన్నపం. మేం సినిమా తీసేదే కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి, సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని. ఇలాంటివి జరిగినప్పుడు మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. థియేటర్ కి వెళ్లినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సినిమా చూడండి. ఎంజాయ్ చేయండి. ఇది నా విన్నపం” అని ఈ వీడియోలో అభిమానులకు విజ్ఞప్తి చేశారు.