మీరంటే నాకు పిచ్చబ్బా…!
– తన ఫ్యాన్స్ గురించి అల్లు అర్జున్ తరచూ చెప్పే మాట ఇది. ఇలాంటి డైలాగులు ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ, ప్రెస్ మీట్లలోనూ హీరోలు చెప్పడం మామూలే! కానీ బన్నీ మాటలు మాత్రం గుండెలోతుల్లోంచి వచ్చినట్టు అనిపిస్తుంటాయి. తన అభిమానులంటే బన్నీకి ఎంతిష్టమో తన చేష్టల వల్ల కూడా బయటపడుతుంటుంది. అదే అభిమానం, అదే ప్రేమ.. బన్నీ మాటల్లో చెప్పాలంటే అదే పిచ్చి… ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వెళ్లింది. సినిమాల్లో క్లైమాక్స్ కు ముందు, హీరో ఓడిపోతున్నాడనుకొనే ముందు.. ఓ ట్విస్ట్ వచ్చి, ఊపిరి పీల్చుకొన్నట్టు…చంచల్ గూడాకి వెళ్లే దారిలోనే బన్నీకి బెయిల్ రావడం, తను అరెస్ట్ నుంచి తప్పించుకోవడం… ఓ పెద్ద రిలీఫ్.
సంధ్య ధియేటర్ దగ్గర అసలు గొడవ మొదలైంది. పుష్ప 2 ప్రీమియర్లకు పర్మిషన్లు రావడం, తన అభిమానుల్ని పలకరించడానికి బన్నీ సంధ్య ధియేటర్‌కు వెళ్లడం, అక్కడ జరిగిన తొక్కిసలాట వల్ల రేవతి అనే మహిళ మరణించడం ఇంత పెద్ద అలజడికి కారణమైంది. ఈ విషయంలో బన్నీ తప్పేంటంటే… జన సందోహం గట్టిగా ఉంటుందని తెలిసినా కూడా సంధ్య ధియేటర్‌కి వెళ్లడం. నిజంగా ఇలా జరుగుతుందని, ఓ నిండు ప్రాణం పోతుందని ఎవరైనా ఊహించారా, బన్నీ కలలోనైనా అనుకొని ఉంటాడా? అయినా సరే… ఆ భారం తాను మోయాల్సివచ్చింది. జరిగిన ఘటన తెలుసుకొని బన్నీ చలించిపోయాడు. పుష్ప 2 సెలబ్రేషన్స్ కూడా వాయిదా వేసి, అభిమాని కుటుంబానికి ఏం చేయాలో, ఎలా చేస్తే.. ఆ కుటుంబానికి అండగా తానున్నానన్న భరోసా ఆ కుటుంబానికి కలుగుతుందో.. అదంతా చేశాడు. ఆ తరవాతే… సక్సెస్ మీట్ పెట్టాడు. ఆ మీట్ లో కూడా జరిగిన ఘటన తలచుకొని తన సంతాపం తెలియజేశాడు బన్నీ. భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఏం కావాలన్నా, తాను ఉన్నానన్న విషయం మర్చిపోవద్దన్న సంకేతాలు పంపాడు. అక్కడితో కథ అయిపోయిందనుకొన్నారు. కానీ… చట్టం తన పని తాను చేసుకొని పోయింది.
శుక్రవారం ఉదయం మొదలైన ఈ హైడ్రామా రాత్రి వరకూ కొనసాగింది. పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం, బెడ్ రూమ్ లో కూడా వెళ్లిపోయి, ఏదో బంధిపోటుని అదుపులో తీసుకొన్నట్టు ప్రవర్తించడం అందరినీ విస్మయపరిచింది. మొన్నటి వరకూ సంధ్య ధియేటర్లో జరిగిన ఘటనకు బన్నీ పరోక్ష కారణం అంటూ మాట్లాడినవాళ్లు సైతం.. అరెస్ట్ చేసిన విధానాన్ని ఏమాత్రం హర్షించలేకపోయారు. ఆ తరవాత చంచల్ గూడా పోలీస్ స్టేషన్‌కి తరలించడం, కోర్టుకు హాజరు చేయడం.. ఇలా స్టెప్ బై స్టెప్ పోలీసులు ప్రతీదీ ప్రణాళికాబద్ధంగా చేశారు. ఈ కేసులో బన్నీకి బెయిల్ రావడం అంత కష్టమేమీ కాదన్నది నిపుణుల అభిప్రాయం. అయితే.. చివరి క్షణం వరకూ బన్నీని చంచల్ గూడా జైలుకి పంపాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించడం చూస్తుంటే, బన్నీపై ఎవరో కక్షపూర్వకంగా ఇవన్నీ చేయిస్తున్నారేమో అనే అభిప్రాయం సామాన్య మానవుడికి కలుగుతుంది. వాదోపవాదనలు అయిన తరవాత బన్నీకి 14 రోజుల రిమాండ్ అనగానే అభిమానుల గుండెల్లో రాయిపడింది. 14 రోజుల పాటు బన్నీ జైల్లో మగ్గాల్సిందేనా… అంటూ అంతా గాభరా పడ్డారు. చివరికి మధ్యంతర బెయిల్ మంజూరవ్వడం వల్ల ఊపిరి పీల్చుకొన్నారు.
ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు.
1. బన్నీని అరెస్ట్ చేస్తారన్న విషయం ప్రభుత్వంలోని పెద్దలకు తెలీదా? రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా ఈ అరెస్ట్ జరిగి ఉంటుందా?
2. అసలు బన్నీకి అరెస్ట్ విషయంలో సమాచారం ఉందా, లేదా?
3. పోలీసులు ఈ ఘటన విషయంలో బన్నీని వవరణ అడిగారా? అడిగితే బన్నీ ఏం చెప్పాడు? అసలు హుటాహుటిన అరెస్ట్ వరకూ ఈ పరిస్థితి ఎందుకు వెళ్లింది?
4. పోనీ.. పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకొన్నారని, ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చని అల్లు అర్జున్, అల్లు అరవింద్ లకు తెలీదా? వాళ్లు ఈ పరిణామాన్ని ఎందుకు ఊహించలేకపోయారు?
5. నిజంగా ముందే తెలిసి ఉంటే.. ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకోలేదు?
6. బన్నీకి ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదన్న ఉద్దేశంతో ఈ వాదనలు అంత బలంగా ఎందుకు జరిగాయి?
ఇవన్నీ ప్రశ్నలే. కానీ వేటికీ సమాధానాలు లేవు. రావు కూడా. తెలిసో.. తెలీకో బన్నీ ఓ తప్పు చేశాడు. పోలీసుల అనుమతి లేకుండా.. సంధ్య ధియేటర్ కి వెళ్లాడు. పరోక్షంగా ఓ అభిమాని మృతికి కారణమయ్యాడు. అయితే.. ఈ విషయంలో పోలీసు వ్యవస్థ కావల్సినదానికంటే ఎక్కువే స్పందించింది అనిపిస్తోంది.
ఈ ఎపిసోడ్ నుంచి కూడా బన్నీ ఫ్యాన్స్ కొన్ని పాజిటీవ్ అంశాల్ని తీసుకోవొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి… ఈ క్షణం వరకూ బన్నీలోని పాజిటీవ్ యాంగిల్ విస్మయ పరుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేయడానికి తన ఇంటికి వచ్చినా, తనని పోలీస్ జీప్ ఎక్కించినా బన్నీ తొణకలేదు, బెణకలేదు. ఎక్కడా అధైర్యపడినట్టు కనిపించలేదు. తన తండ్రి అరవింద్, తనకు తోడుగా పోలీస్ జీప్ ఎక్కినా నిరాకరించాడు. `ఈ ఇష్యూలో ప్లస్సయినా, మైనస్ అయినా టోటల్ క్రెడిట్ నాదే` అంటూ వ్యవహారం మొత్తాన్ని తన భుజాలపై వేసుకొన్నాడు. వైద్యపరిక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడూ, కోర్టు ముంగిట కూడా.. బన్నీలో ధైర్యమే కనిపించింది.
బన్నీని అరెస్ట్ చేస్తారనగానే సినిమా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిర్మాతలు బన్నీతో పాటు పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ
తిరగడం మొదలెట్టారు. త్రివిక్రమ్ కోర్టు ఆవరణకు వెళ్లి మరీ.. బన్నీకి ధైర్యం చెప్పాడు. చిరంజీవి షూటింగ్ వాయిదా వేసుకొని.. బన్నీ ఇంటికి వెళ్లాడు. రామ్ చరణ్ సైతం ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకొన్నాడు. పుష్ప 2కు ముందు మెగా ఫ్యామిలీ వెర్సస్ అల్లు అర్జున్ అన్నట్టు అభిమానుల గలాటా సాగింది. అయితే ఇప్పుడు, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే అని, బన్నీ ఏం వేరు కాడన్న సంకేతాల్ని మెగా హీరోలు పంపగలిగారు.
బన్నీపై ఎక్కడో, ఏదో మూల కోపంగా ఉన్నవాళ్లు కూడా ఈరోజు బన్నీని చూసి `అరె.. పాపం` అని మనసులోనే బాధ పడ్డారు. బన్నీకి ఏం జరగకూడదని బలంగా కోరుకొన్నారు. ఇదంతా బన్నీ సాధించిన విజయాలే. ప్రతికూల పరిస్థితుల్ని ఛేధించుకొని రావడం, ఎదురొడ్డి నిలబడడం కంటే గొప్ప హీరోయిజం ఏముంటుంది? ఇప్పుడు బన్నీలోనూ అదే కనిపిస్తోంది.
మొత్తంగా ఈ ఎపిసోడ్ టాలీవుడ్ ని కొన్నాళ్ల పాటు వెంటాడుతుంది. పుష్ప 2 విజయాన్ని ఆస్వాదించాల్సిన బన్నీ, ఆ సినిమా ప్రీమియర్ షోలో జరిగిన ఓరగడ వల్ల.. తన జీవితంలో ఎప్పుడూ చూడని పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సివచ్చింది. భవిష్యత్తులో పుష్ప పేరు ఎప్పుడు ఎత్తినా.. సంధ్య ధియేటర్ ప్రీమియర్ షో.. ఆ తరవాత జరిగిన పరిణామాలూ గుర్తుకు రావడం తధ్యం. తిపి వెనుక చేదు, చేదుతో పాటు తీపి మిళితమైపోవడమే జీవితం.. ఇది `పుష్ప` సినిమా విషయంలో అక్షర సత్యం.