అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు సోమవారం సాయంత్రం ఆయనకు చేరాయి. కోర్టులకు వెళ్లి పోలీసుల ఎదురట హాజరవ్వకుండా మినహాయింపులు తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో పొద్దుపోయాక ఈ నోటీసులు పోలీసులు జారీ చేసినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ అంశంపై చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకే అల్లు అర్జున్ డుమ్మా కొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
సంధ్యా ధియేటర్ తొక్కిసలాట వివాదం చాలా సున్నితంగా మారింది. అల్లు అర్జున్ తరపు లాయర్లు పూర్తిగా పోలీసుల తప్పు అని వాదించి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అల్లు అర్జున్ చెప్పింది కూడా పోలీసులకు నెగెటివ్ గా ఉంది. అందుకే పోలీస్ కమిషనరే ఏకంగా ఆధారాలు బయట పెట్టారు. ఆయన ఇంకా చాలా చూడాల్సి ఉంటుందని హెచ్చరికలు కూడా పంపారు.
ఇప్పుడు అల్లు అర్జున్ లీగల్ టీం ఆయనకు ఏ సలహా ఇస్తుందన్నది ఆసక్తికరం. పోలీసుల ముందుకు వెళ్లకుండా లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామని చెబుతారో.. ఇంత కన్నా తెగేదాకా లాక్కోకుండా.. విచారణకు హాజరై.. రావడం మంచిదని అనుకుంటారో తెలియాల్సి ఉంది. పోలీసుల ముందు హాజరైనా అర్జున్ కు అరెస్టు ముప్పు లేదు. ప్రశ్నించి వదిలేస్తారు. కానీ విచారణకు హాజరు కాకపోతే ఆయన రెగ్యులర్ బెయిల్ వాదనల్లో పోలీసులకు బలం చేకూరుతుంది.