‘పుష్ప 2’ తరవాత అల్లు అర్జున్ ఫుల్ రెస్ట్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. ఓవైపు త్రివిక్రమ్, మరోవైపు అట్లీ.. బన్నీ కోసం కథలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. అయితే వీళ్లలో ఎవరి సినిమా ముందు మొదలవుతుంది? అనేది పెద్ద ప్రశ్నార్థకం. కొందరైతే అట్లీ సినిమానే ముందుకు వస్తుందని, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లేట్ అవుతుందని జోస్యం చెప్పారు. ఇప్పుడు అదే నిజం కానుంది. బన్నీ – అట్లీ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో అంటే.. ఈనెల 8న కాబోతోంది. అందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి.
అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ని ప్రకటనలా కాకుండా, ఓ వీడియో గ్లింప్స్ రూపంలో ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ వీడియోలో బన్నీ, అట్లీ ఇద్దరూ కనిపిస్తారు. వాళ్లతో పాటు ప్రధానమైన టెక్నీషియన్లని పరిచయం చేసే అవకాశం ఉంది. ఇటీవల బన్నీ ముంబై వెళ్లాడు. అక్కడ కొన్ని రోజుల పాటు గడిపాడు. ఆ సమయంలోనే అట్లీతో కథ విషయంలో చర్చలు జరిపాడు. ఈ వీడియోని కూడా అక్కడే షూట్ చేశారని సమాచారం. మరోవైపు త్రివిక్రమ్ కూడా స్క్రిప్టుపై పూర్తి స్థాయి కసరత్తులు చేస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ఫొటో షూట్ మే, జూన్లలో జరిగే అవకాశం ఉంది. ఆ తరవాత రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు. రెండు సినిమాల్నీ దాదాపు ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్తారు.