‘పుష్ప 2’ తరవాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కాలి. అయితే ఈ సినిమా స్క్రిప్టు విషయంలో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. ఈ వేసవిలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రానికి క్లాప్ కొట్టాలి అనుకొన్నారు. అయితే ఈమధ్యలో అట్లీ ప్రాజెక్ట్ కూడా ఓకే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు అట్లీ.. అల్లు అర్జున్తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. అయితే అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. అయితే ఇప్పుడు ఈ కాంబో దాదాపుగా ఫిక్సయ్యిందని, త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వస్తుందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో కథానాయిక స్థానం కూడా దాదాపుగా ఖరారైపోయిందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ కోసం జాన్వీని సంప్రదించారు. బన్నీతో నటించడానికి జాన్వీ సిద్ధమే అయినప్పటికీ, ఇంకాస్త బెటర్ ఆప్షన్ కోసం ఎదురు చూసింది. ఐటెమ్ గీతం గనుక చేస్తే, ఆ తరవాత… హీరోయిన్గా చేసే అవకాశం ఆలస్యం అవుతుందేమో అన్నది జాన్వీ భయం. అందుకే ‘పుష్ప 2’ ఐటెమ్ పాటకు నో చెప్పింది. అది మంచిదే అయ్యింది. ఇప్పుడు బన్నీతో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కించుకొంది. పుష్ప 2లో గనుక ఐటెమ్ పాట చేసి ఉంటే, మళ్లీ ఇంత త్వరగా ఈ ఛాన్స్ వచ్చేది కాదేమో. అనిరుథ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తారని తెలుస్తోంది. ‘జవాన్’ కోసం పని చేసిన బృందంలో చాలామంది ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి.