ఈ ఆదివారం అల్లు అర్జున్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. స్టార్ హీరో పుట్టిన రోజు అంటే.. హడావుడి మామూలుగా ఉండదు. టీజరో, ట్రైలరో ఏదో ఒకటి బయటకు వస్తుంది. పైగా అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అందుకే బన్నీ పుట్టిన రోజుని ప్రత్యేకంగా జరపాలని చిత్రబృందంతో పాటు అభిమానులు కూడా నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విశాఖ బీచ్లో ఓ భారీ సైతిక శిల్పం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది టీమ్. అంటే… ఇసుక తో చేసే శిల్పాలన్నమాట. దేశంలో ప్రత్యేక వ్యక్తులు, ప్రత్యేక సందర్భాల్ని గుర్తు చేసుకొనేటప్పుడు విశాఖ బీచ్లో సైతిక శిల్పాలను రూపొందిస్తుంటారు. ఇందుకోసం నిపుణుడైన ఓ శైతిక శిల్పిని చిత్రబృందం పిలిపిస్తోంది. ఆదివారం విశాఖ బీచ్లో బన్నీ ఇసుక శిల్పాన్ని చూడొచ్చన్నమాట. ఆరోజే `నా పేరు సూర్య`కి సంబంధించిన కొత్త టీజరో.. పాటో బయటకు వచ్చే అవకాశం ఉంది.