మెగా ఇంటి నుంచి ఓ హీరో వస్తున్నాడంటే…
ఆశగా ఎదురు చూసే కళ్లే కాదు, నిందించడానికి సిద్ధమయ్యే నోళ్లూ ఉంటాయి.
‘ఆ ఫ్యామిలీ నుంచేనా హీరోలొచ్చేది’
‘వాళ్లు తప్ప ఇంకెవరూ ఎదగలేరా?’
‘ఇంకెంతమందిని రుద్దుతారు’.. – ఇలాంటి పెదవి విరుపు మాటలకు లెఖ్ఖలేదు.
అల్లు అర్జున్ ఇందుకు అతీతుడేం కాదు. అల్లు రామలింగయ్య వారసుడు అల్లు అరవింద్ మంచి నిర్మాత అయ్యాడేమో కానీ, నటుడు కాలేకపోయాడు. అందుకే బన్నీ హీరో అనగానే వెటకారం చేసినోళ్లు ఎక్కువే కనిపించారు. పైగా తొలి సినిమా ‘గంగోత్రి’. ఆ సినిమాలో పాటలన్నీ హిట్టు. సినిమా కూడా బాగానే ఉంటుంది. కానీ… లాగూ, చొక్కాలో బన్నీని చూసినవాళ్లంతా నవ్వుకొన్నారు. అదే ఆఖరి సినిమా అవుతుందని జోస్యం చెప్పినవాళ్లూ ఉన్నారు. నూనూగు మీసాలు కూడా రాని వయసది. సినిమా అంటే పూర్తిగా అవగాహనే లేదు. తొలి సినిమాతోనే చిరంజీవిలా డాన్సులు చేయాలనో, స్టెప్పులు వేయాలనో ఆశిస్తే ఎలా..? అందుకే గంగోత్రి సినిమాతో బన్నీ ట్రోలింగ్ మెటీరియల్ అయ్యాడు. ‘ఆ సినిమా టీవీలో వస్తే నేను దాక్కుంటాను.. అస్సలు చూడను’ అని బన్నీనే స్వయంగా అన్నాడంటే మేటర్ అర్థం చేసుకోవొచ్చు.
ఆ తరవాత ‘ఆర్య’.
‘గంగోత్రి’కి ‘ఆర్య’కీ ఎంత తేడా? బన్నీ ఏం చేయగలడో, బన్నీతో ఏం చేయించొచ్చో.. ‘ఆర్య’ సినిమా చూపించింది. ‘ఆర్య’ బన్నీకి ఓ విజిటింగ్ కార్డ్. ఆ తరవాత ఇక వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం, అవకాశం లేకుండా పోయాయి. నొసలు చిట్లించినవాళ్లే, కళ్లింతింత చేసుకొని బన్నీ డాన్సుల్ని, స్టైల్‌నీ ఆరాధించడం మొదలెట్టారు. బన్నీ ఎంత గొప్ప డాన్సరో… ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎక్కడా… చిరుని కాపీ కొట్టలేదు. చిరుని గుర్తు చేసే ప్రయత్నం చేయలేదు. తన పంథాలో తాను వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇండియాలోనే ది బెస్ట్ డాన్సర్లలో బన్నీ ఒకడు. నో డౌట్!
బన్నీ, దేశముదురు, పరుగు, డీజే, సరైనోడు, అల వైకుంఠపురములో..
ఒక సినిమాకీ మరో సినిమాకి సంబంధం లేదు.
ఒక పాత్రకూ మరో పాత్రకూ పొంతన లేదు.
ప్రతీచోటా తనదైన మార్క్! తనదైన స్టైల్! ‘బన్నీ సినిమా అంటే ఇలా ఉండాలి’ అని ఓ మీటర్ సెట్ చేసుకొంటూ వెళ్లిపోయాడు.
ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు.. పుష్ష మరో ఎత్తు.
స్టైలీష్ స్టార్ అనే బిరుదుని పక్కన పెట్టి, రగ్గడ్ లుక్‌తో.. అందరినీ షాక్‌కి గురి చేశాడు. తన మేకొవర్ చూసి టాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోయింది. ముందు బాక్సాఫీసు రికార్డులు మోకరిల్లితే, ఆ తరవాత… దశాబ్దాలుగా తెలుగు నటుల్ని ఊరిస్తున్న జాతీయ అవార్డు దాసోహమంది. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచీ వెండి తెరను ఏలిన అపురూప కథానాయకులకు దక్కని అదృష్టం.. అవకాశం బన్నీని వరించింది. ఈ సినిమాతో బన్నీ స్టామినా ఏమిటో ఉత్తరాదికి తెలిసొచ్చింది. ‘పుష్ష’తో తెలుగు సినిమా లెక్కలే కాదు, బాలీవుడ్ దర్శకుల ఆలోచనా సరళి కూడా పూర్తిగా మారిపోయింది. అలా… బన్నీ ఓ రియల్ గేమ్ ఛేంజర్ అయ్యాడు. బన్నీ ఖ్యాతి ఖండాంతరాలు దాటిందనడానికి ఇటీవల దుబాయ్ లో వెలసిన బన్నీ స్టాట్యూనే నిదర్శనం. బాలీవుడ్ స్టార్లకు సైతం దక్కని అరుదైన అవకాశం అది.
మిగిలిన హీరోలకూ, బన్నీకి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే.. తనని తాను ప్రమోట్ చేసుకోవడం. బన్నీ పీఆర్ చాలా బలంగా ఉంటుంది. పుష్షకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరిగిందంటే దానికి కారణం.. అదే. సోషల్ మీడియాలో బన్నీ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సౌత్ లో ఏ హీరోకీ దక్కని ఆదరణ అది. బాలీవుడ్ స్టార్లు కూడా ముక్కున వేలేసుకొనే క్రేజ్ అది. మెగా హీరోలతో ఊపిరి సలపని పోటీ, మరో వైపు.. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ లాంటి వాళ్ల జోరు.. వాటిన్నింటి మధ్య బన్నీ నిలబడగలిగాడు. వాళ్ల మధ్య ఉంటూనే తన ప్రత్యేకత ఏమిటో చూపించుకొన్నాడు. అందుకే… తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకొన్నాడు.
త్వరలో ‘పుష్ష 2’ రాబోతోంది. ‘పుష్ష’తో నెలకొల్పిన రికార్డులన్నీ ‘పుష్ష 2’తో బద్దలు కొట్టాలి. అక్కడితో ఆగకూడదు. బాలీవుడ్ లోనూ మన జెండా పాతాలి. మన తెలుగు హీరోలో ఎందులోనూ తీసిపోరని చాటి చెప్పాలి. బన్నీ ఇవన్నీ చేయగలడు.. చేస్తాడు కూడా.
ఎందుకంటే బన్నీ స్టైలే అంత.
నీయవ్వ.. ‘తగ్గేదేల్యే’!!
(ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు)