”ఇనుమును ఇనుమును నేను
కాల్చితే కత్తవుతాను..
రాయిని రాయిని నేను..
గాయం కానీ చేశారంటే
కచ్చితంగా దేవుడ్నవుతాను”
ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు.
ఈ పేరు స్మరించుకోగానే చంద్రబోస్ రాసిన ఈ పాట గుర్తొస్తోంది. అది కూడా బన్నీ కోసం కావడం యాదృచ్చికం.
పుష్పలో హీరో క్యారెక్టర్ కోసం చంద్రబోస్ ఈ పాట రాశారు కానీ, బన్నీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కూడా ఇందుకు ఏమాత్రం తక్కువ కాదు.
మెగా కాంపౌండ్ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డాన్స్ చేయాలి. ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలి. మాస్‌ని ఎట్రాక్ట్ చేయాలి. ఇవన్నీ ప్రతీ హీరో చేసేవే. కానీ మెగా హీరో ఇందుకు వంద రెట్లు చేయాలి. లేదంటే అంచనాల్ని అందుకోవడం కష్టం. బన్నీ ఇవన్నీ చేస్తూనే `మెగా హీరో` అనే స్టాంప్‌ని మెల్లమెల్లగా తుడుచుకొంటూ వచ్చి, తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకొన్నాడు. జాతీయ అవార్డు సాధించాడు. నార్త్ లో.. ఏ సౌత్ హీరోకీ దక్కనంత క్రేజ్ సంపాదించుకొన్నాడు. తన సినిమా దాదాపు రూ.2 వేల కోట్ల మైలు రాయిని చేరుకొంది. వ్యక్తిగతంగా సినిమాకు రూ.150 కోట్ల పారితోషికం తీసుకొనే స్థాయికి ఎదిగాడు. అయితే ఇదంతా రాసినంత సులభంగా, చదివినంత వేగంగా మాత్రం రాలేదు.
‘గంగోత్రి’ హిట్. పాటలు సూపర్ హిట్. కానీ బన్నీకి ప్రత్యేకంగా వచ్చిన మైలేజీ ఏం లేదు. ఎందుకంటే… తన స్క్రీన్ ప్రెజెన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ‘మెగా పేరుతో రుద్దేస్తున్నారా’ అనే ఫిర్యాదులు ఎన్నో వినిపించాయి.
కట్ చేస్తే… ‘ఆర్య’. గంగోత్రిలో చూసింది, అక్కడ చెడ్డీలు వేసుకొని తిరిగింది.. ఈ కుర్రాడేనా? అని ఆశ్చర్యపోయేంత మార్పు.
డాన్సులు, ఫైట్స్, ఎమోషన్స్, స్టైల్… అన్నింట్లోనూ తేడా స్పష్టంగా కనిపించింది. ఆ క్షణం అనిపించింది… తెలుగు సినిమాకు ఓ కొత్త హీరో పుట్టాడని. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు. అలా రానివ్వకుండా చేసుకొన్నాడు.
తెలుగులో పేరు సంపాదించాక, తన ఫోకస్ ఇతర భాషలపై పెట్టాడు. మలయాళంలో మార్కెట్ సంపాదించుకొన్న మొదటి హీరో… బన్నీనే. `పుష్ప`తో ఇండియా అంతా బన్నీ పేరు మార్మోగిపోయింది.
హీరోగా కెమెరా ముందు కష్టపడడం ఒక ఎత్తు. తన కష్టాన్ని మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. కష్టానికి ప్రొఫెషనలిజం చాలా అవసరం. బన్నీ అదే చేశాడు. తనకున్న పీఆర్ టీమ్ చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే.. బన్నీ ఏం చేసినా, క్షణంలో అది వైరల్ అయిపోతుంది. ముంబైలోనూ దాని గురించి మాట్లాడుకొంటారు. అంతర్జాతీయంగా తెలుగు వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అదే హాట్ టాపిక్ అవుతుంది. ‘పుష్ప’లో బన్నీ మేనరిజం.. ప్రపంచ వ్యాప్తంగా ఓ బ్రాండ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ క్రికెటర్లు సైతం… ప్లే గ్రౌండ్ లో బన్నీని అనుసరించారు. ‘పుష్ప.. ఝుకేగానై సాలా’ అనేది ఓ మంత్రంగా మారిపోయింది. ఇదంతా బన్నీ పాపులారిటీకి నిదర్శనం.
ఓ హీరోకైనా అభిమానులు ఉంటారు. చిన్న పని చేసినా నెత్తిమీద పెట్టుకొంటారు.
అదే సమయంలో ఏ హీరోకైనా హేటర్స్ ఉంటారు. ఆ హీరో చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ చెలరేగిపోతారు. బన్నీకీ ఆ ఇబ్బంది ఉంది. బన్నీ నోరుజారిన సందర్భాలు ట్రోలింగ్ కి గురయ్యాయి. చిన్న చిన్న విషయాలూ… రాద్ధాంతాలుగా మారిపోయాయి. ‘చెప్పను బ్రదర్’ దగ్గర్నుంచి స్టేజీపై ముఖ్యమంత్రి పేరు మర్చిపోయేదాకా… ఎన్నో ఉదాహరణలు. ఇవన్నీ బన్నీని బాగా ఇబ్బంది పెట్టాయి.
సంధ్య ధియేటర్ దుర్ఘటనతో అయితే బన్నీ నలిగిపోయాడు. తన కెరీర్లో ‘పుష్ప 2’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తరవాత కూడా… ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయాడు. అందులోంచి తేరుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఇంకా ఆ జ్ఞాపకాలు బన్నీని డిస్ట్రబ్ చేస్తూ ఉండొచ్చు.
అయితే కాలం దేని కోసం ఆగదు. తన పని తాను చేసుకొంటూ వెళ్తుంది. బన్నీ కూడా తన పనిలోనే పడిపోయాడు. ఓ వైపు అట్లీ కథ ఓకే చేశాడు. మరోవైపు త్రివిక్రమ్ బన్నీ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారు. బన్నీ కోసం బాలీవుడ్ దర్శకులు ఎదురు చూస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన కథానాయకుల్లో బన్నీ ఒకడు. భవిష్యత్తులో.. తన స్థానం మరింత పదిలపరచుకోవడానికి ఇదివరకటి కంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు.
”నను మించి ఎదిగేటోడు ఇంకోడున్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే” అనుకొనేంత నమ్మకంగా, రాక్షసంగా తన పని తాను చేసుకొంటూ పోతున్న ఐకాన్ స్టార్‌కి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.