‘గంగోత్రి’లో చెడ్డీలు వేసుకున్న పిల్లాడు
మీసాలింకా పూర్తిగా మొలవని పిల్లాడు
డైలాగ్ డిక్షన్లో ఇంకా ఓనమాల స్థాయిలోనే ఉన్నోడు…
ఆ వాలకం చూస్తే..
”వీడేంటి? హీరో ఏంటి? డబ్బులుంటే ఎవరైనా హీరో ఐపోవొచ్చు” అనే ఎటకారపు మాటలు మాట్లాడి ఉండొచ్చు..!
అలాంటి అల్లు అర్జున్..
ఇప్పుడు స్టైల్‌కి ఐకాన్
డాన్స్‌కి గురు
లుక్స్‌లో పీక్స్
పాత్ర ఏదైనా… పీల్చి పిప్పి చేసేస్తాడు.
‘హీరో అంటే ఇలా ఉండాలి’ అంటూ… కితాబులు అందుకుంటున్నాడు.
ఎంత తేడా..? ‘ఎదగడం’ అంటే ఇదే.. ‘నేర్చుకోవడం’ అంటే ఇదే. స్టార్స్ నడిచిన ఇంట్లోంచి వచ్చి.. స్టార్‌గా ఎదగడం మాటలు కాదు. ‘నా వెనుక నాన్న ఉన్నాడులే.. గీతా ఆర్ట్స్ ఉందిలే’ అనుకుంటే… బన్నీ ఇంకా ‘గంగోత్రి’ దగ్గరే ఉండిపోదుడు. గంగోత్రి వరకూ బన్నీ వెనుక గీతా ఆర్ట్స్ ఉందేమో. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ముందే.. బన్నీ ఉన్నాడు. ఇంకేం కావాలి.. అతని ప్రయాణం గురించి చెప్పడానికి.
గంగోత్రి టీవీలో వస్తుంటే చూస్తారా?
ఇది బన్నీని అడిగిన ప్రశ్న.
”గంగోత్రి వస్తే.. ఎక్కడైనా దాక్కుంటా..”
ఇదీ బన్నీ సమాధానం.
తొలి సినిమాలోనే తన తప్పులు అర్థమైపోయాయి. తన లోపాలు కనిపించేశాయి. వాటిని ఒప్పుకుని, తప్పులు దిద్దుకుని, మరో సరికొత్త బన్నీని చూడ్డానికి ఎంతో కాలం పట్టలేదు. ‘ఆర్య’ వచ్చేసరికి.. అల్లు అర్జున్ మామూలోడు కాదని అర్థమైపోయింది. అందులో డాన్సులు, నటన, ఎమోషన్స్.. ఇవన్నీ ‘చిత్రసీమకు మరో స్టార్ హీరో రాబోతున్నాడు’ అని హింటిచ్చేశాయి. ఆ తరవాత.. మాస్ పల్స్ సరిగ్గా అంచనా వేసే వినాయక్ చేతిలో పడ్డాడు. ‘బన్ని’ని రియల్ ‘బన్ని’గా చూపించాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్టే..
వరుస హిట్లతో ఎవరైనా రిలాక్సయిపోతారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదు. తనని తాను వెదుక్కుంటూ, నేర్చుకుంటూ ప్రయాణం చేశాడు. ‘హ్యాపీ’ సినిమా ఫ్లాపయ్యింది. కానీ అందులో బన్నీ నటనని తక్కువ చేయలేం. ‘పరుగు’.. అంత స్పీడు చూపించలేకపోయాడు. కానీ.. బన్నీని తప్పు పట్టలేం. ‘వేదం’లో కేబుల్ శీనుని చూస్తే చాలు.. బన్నీ లోలోపల ఓ అద్భుతమైన నటుడు దాగున్నాడని, తనలో తవ్వుకోవాల్సిన ప్రతిభ ఇంకా టన్నుల కొద్దీ ఉందని అర్థమవుతుంది. ఈ మధ్యలో ఎన్నో హిట్లు, కొన్ని ఫ్లాపులు.. సినిమా ఏదైనా, ఫలితం ఎలా ఉన్నా.. బన్నీకి మాత్రం ఫుల్లుగా మార్కులు పడిపోతూ వచ్చాయి. ప్రతీ సినిమాలోనూ స్టైల్‌ని జోడించడం మర్చిపోలేదు. ‘దేశముదురు’ నుంచి హీరోల హెయిర్ స్టైలింగ్ లో మార్పు కనిపించింది. సిక్స్ ప్యాక్‌లు చేసే సాహసం తెలుగు హీరోలూ చేయడం మొదలెట్టారు. డ్రస్సింగ్, డాన్సింగ్ అన్నిటా వందకు వంద మార్కులే. ఇదే స్టైల్‌కి మలయాళం చిత్రసీమ కూడా దాసోహం అయిపోయింది. అక్కడ మల్లూస్టార్గా మారిపోయాడు ఈ అల్లూ హీరో.
‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర.. తనకు మరో సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. తెలంగాణ యాసలో బన్నీ చెప్పిన డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. తెరపై అనుష్క, తెర వెనుక గుణశేఖర్ కష్టపడినా.. ఆ క్రెడిట్ మొత్తం బన్నీ లాక్కెళ్లిపోయాడు. సరైనోడుతో తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓ సూపర్ కమర్షియల్ హిట్ తన ఖాతాలో వేసుకోగలిగాడు. ఇలా పదిహేనేళ్ల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి… ప్రతీ సినిమాతోనూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ… టాలీవుడ్ అగ్ర కథానాయకుల సరసన చేరాడు అల్లు అర్జున్. ఇప్పుడు ‘నాపేరు సూర్య’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మే 4న ఈ చిత్రం విడుదల కానుంది. ‘సూర్య’ కోసం కూడా బన్నీ చాలా కష్టపడ్డాడు. నిజమైన ఆర్మీ ఆఫీసర్లా మారాడు. ఈ కష్టం ఫలించాలి. బన్నీకి మరో సూపర్ హిట్ దక్కాలి. ఈ పదిహేనేళ్ల ప్రయాణానికి గుర్తుగా తనో మధురమైన విజయాన్ని విజయాన్ని అందుకోవాలి. ఆల్ ద బెస్ట్… బన్నీ!!